తనకు జరుగుతున్న బాల్య వివాహన్ని పోలీసుల సాయంతో ధైర్యంగా ఆపేసిన ఓ బాలిక బుధవారం ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.
తనకు జరుగుతున్న బాల్య వివాహన్ని పోలీసుల సాయంతో ధైర్యంగా ఆపేసిన ఓ బాలిక బుధవారం ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ విషాద ఘటన తమిళనాడులో జరిగింది.
వివరాల్లోకి వెడితే.. తమిళనాడు, మదురై జిల్లా పాండియూరుకు చెందిన రజనీ, తామరై సెల్వి దంపతుల కుమార్తె (17)కు సమీప గ్రామానికి చెందిన యువకుడితో వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. ప్లస్ టూ పూర్తి చేసిన తాను ఉన్నత చదువులు చదువుకోవాలని, తనకు పెళ్లి వద్దంటూ ఆ బాలిక తల్లిదండ్రుల్ని వేడుకున్నా వారు ఖాతరు చేయలేదు.
దీంతో దిక్కుతోచని ఆ అమ్మాయి ధైర్యంగా ఆలోచించింది. తన వివాహాన్ని అడ్డుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన అధికారులు ఆమె వివాహాన్ని అడ్డుకున్నారు.
బాలిక తల్లిదండ్రులను, వరుడి కుటుంబాన్ని హెచ్చరించి వదిలి పెట్టారు. ఇంత ధైర్యం చేసినందుకు బాలికను అభినందించారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. పెళ్లి కూడా ఆగిపోయింది. బాలిక సంతోషంగా ఉంది. అయితే అంతలోనే విషాదం చోటు చేసుకుంది.
మంగళవారం పెళ్లి ఆగిపోయిన తరువాత.. బుధవారం ఉదయాన్నే బాలిక శవంగా కనిపించింది. ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో బాలిక మృతదేహం కనిపించింది. దీంతో అనుమానాలు రేగుతున్నాయి. ఈ సమాచారం అందుకున్న మదురై అన్నానగర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెను హతమార్చి ఉరేసుకున్నట్లు నాటకం ఆడుతున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
