తన ప్రియుడిని పెళ్లాడేందుకు అడ్డుగా ఉందని మైనర్ కూతురును అమ్మేసిందో తల్లి. అలాగే కుమారుడిని కూడా ఓ ప్రైవేట్ హాస్టల్ లో చేర్పించింది. తరువాత ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయింది. అయితే కుమారుడిని ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆమెకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త రెండేళ్ల కిందట చనిపోయారు. కొంత కాలం తరువాత ఆమెకు మరో వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడితో ఆమె ప్రేమలో పడింది. అతడిని పెళ్లి చేసుకోవాలని భావించింది. అయితే పిల్లలతో వస్తే తాను పెళ్లి చేసుకోబోనని అతడు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దీంతో ఏమాత్రం ప్రేమ లేకుండా మైనర్ కూతురును ఓ వ్యాపారికి ఆమేసింది. ఈ ఘటన బీహార్ లోని ముజఫర్ పుర్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ లోని రాంచీ పట్టణానికి చెందిన ఓ మహిళకు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కూతురు, ఓ కుమారుడు జన్మించారు. ఇద్దరూ ప్రస్తుతం మైనర్లే. అయితే ఈ కుటుంబ పనుల కోసం కొన్ని సంవత్సరాల క్రితం బీహార్ లోని ముజఫర్‌పుర్ ప్రాంతానికి వలస వచ్చారు. అక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఈ క్రమంలో రెండు సంవత్సరాల కిందట ఆ కుటుంబ పెద్ద చనిపోయారు. భర్త చనిపోయిన తరువాత కొన్నాళ్లకు భార్యకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఇద్దరు పిల్లలను తన వద్దకు తీసుకురాకూడదని అతడు కండీషన్ పెట్టాడు. దీంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు.
తన పొరిగింట్లో ఉండే దంపతుల సాయం తీసుకొని కూతురును ఓ 35 ఏళ్ల వ్యాపారవేత్తకు అమ్మేసింది. అలాగే కొడుకును కూడా ఓ ప్రైవేట్ స్కూల్ కు అనుబంధంగా ఉండే హాస్టల్ లో చేర్పించింది. అనంతరం ఆమె ఢిల్లీకి పయనమయ్యింది. అయితే ఆ ప్రైవేట్ హాస్టల్ లో ఆమె ఎలాంటి ఫీజు చెల్లించలేదు. దీంతో అక్కడి సిబ్బంది బాలుడిని ఆరా తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆ బాలుడు తాత, మామయ్యకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి మైనర్ ఎక్కడుందో గుర్తించారు. ఆ బాలికను కొనుగోలు చేసిన వ్యాపారవేత్తను, ఈ వ్యవహారంలో సహాయం చేసిన పొరుగింటి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఆ మహిళను, ఆమె ప్రియుడి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
