పశ్చిమ బెంగాల్‌లో ఓ విషాద గధ వెలికి వచ్చింది. దక్షిణ కోల్‌కతాలో నివసిస్తున్న ఓ వ్యక్తి తన అన్నను చంపానని పోలీసులను ఆశ్రయించాడు. కానీ, డెడ్ బాడీ పోస్టుమార్టం రిపోర్టు మాత్రం సదరు వ్యక్తి హత్యకు గురికాలేదని, అనారోగ్య సమస్యలతో మరణించాడని పేర్కొంది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి లోతుగా విచారించగా.. పోలీసులే కంటనీరు పెట్టుకునే విషాదం తెలియవచ్చింది.

కోల్‌కతా: అసమాంతర అభివృద్ధి కొన్ని జీవితాల్లో వెలుగులు నింపుతుంటే.. మరికొన్ని జీవితాలను విధ్వంసంలోకి నెట్టేస్తుంది. కొన్ని కుటుంబాలు ఎన్నో రెట్లతో అభివృద్ధి చెంది పురోగమిస్తుంటే.. మరికొన్ని కుటుంబాలు అదే వేగంతో అధోపాతాళానికి కొట్టుకుపోతున్నాయి. ఈ ఆర్థిక అసమానతలు జీవితాలను విషాదంలోకి నెడుతున్నాయి. బయటికీ అంతా సరిగానే సాగుతున్నట్టు కనిపిస్తున్నా.. బయటపడని కన్నీటి గాధలు అనేకం ఈ సమాజంలో నిండి ఉన్నాయి. అలాంటి ఓ విషాద గాధ ఇటీవలే పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది.

పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి రాత్రిపూట పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులకే షాక్ ఇచ్చే న్యూస్ చెప్పాడు. తాను తన అన్నను చంపేశాడని, తనను అరెస్టు చేసి జైలులో వేయాల్సిందిగా పోలీసులను ప్రాధేయపడ్డాడు. ఈ వార్త విని పోలీసులు ఖంగుతిన్నారు. డెడ్ బాడీ ఎక్కడ ఉందో చెప్పాలని పోలీసులు ఆదేశించారు. ఆ వ్యక్తి తిన్నగా వారి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ వ్యక్తి చెబుతున్నట్టుగా అక్కడ డెడ్ బాడీని పోలీసులు కనిపెట్టారు. పోస్టుమార్టం కోసం హాస్పిటల్ పంపారు. కానీ, పోస్టుమార్టం నివేదిక వారికి మరో షాక్ ఇచ్చింది. అసలు ఆ వ్యక్తి హత్యకు గురి కాలేదని, అనారోగ్య సమస్యలతో మరణించాడని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎందుకు పోలీసులను ఆశ్రయించి హత్య నేరాన్ని మోయాలని అనుకున్నాడో తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నించారు. కానీ, ఈ ప్రయత్నం వారిని కంటతడి పెట్టించింది.

దక్షిణ కోల్‌కతా బన్స్‌ద్రోని పోలీసు స్టేషన్ పరిధిలో స్నేహాశిష్ చక్రవర్తి (45), దేబాశీష్ చక్రవర్తి (48) సోదరులు నివసించేవారు. వారు కఠిక దరిద్రంలో బతికారు. ఆ పేదరికంలో మగ్గుతూనే ఒకరిపై ఒకరికి అంతులేని అనురాగాన్ని పెంచుకున్నారు. దేబాశీష్ చక్రవర్తికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం కన్నుమూశాడు.

తన సోదరుడు మరణించిన తర్వాత స్నేహాశిష్ చక్రవర్తి బన్స్‌ద్రోని పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. తన అన్నను చంపేశానని చెప్పాడు. తన అన్న ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చికిత్స అందించే ఆర్థిక స్తోమత తనకు లేదని కన్నీరు పెట్టుకున్నాడు. ఆయన బాధ చూడలేక దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హతమార్చానని చెప్పాడు. అనంతరం పోలీసులు స్పాట్‌కు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపించారు. ఆ పోస్టుమార్టం రిపోర్టు మాత్రం దేబాశీష్ చక్రవర్తి అనారోగ్యంతో మరణించాడని స్పష్టంగా ఉన్నది. కనీసం పెనుగులాట కూడా జరిగిన ఆనవాళ్లు స్పాట్‌లో లేకపోవడాన్ని పోలీసులు గమనించారు. అసలు విషయం ఏమిటని ఆరా తీశారు. దర్యాప్తు కోణం మార్చారు. దీంతో వారికి స్నేహాశివ్ చక్రవర్తి గాధ తెలిసింది.

స్నేహాశిష్ ఆర్థిక స్థితి ఏమాత్రం బాగాలేదని, అన్నను చంపానని నేరం మోసి జైలుకు వెళ్లినా అన్నం దొరుకుతుందని ఆశపడ్డట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆయన పరిస్థితిని చూసి పోలీసులు తల్లడిల్లారు. ఆయనకు భోజనం, వసతి కల్పించడానికి వారు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్టు తెలిసింది. దేబాశిష్, స్నేహాశిష్‌లు కలిసి మెలిసి ఉండేవారని, దేబాశిష్ చనిపోవడంతో స్నేహాశిష్ ఒంటరివాడయ్యాడని స్థానికులు కూడా ఆవేదనతో చెప్పారు.