జమ్మూకాశ్మీర్ లోని ఎల్వో సీ వద్ద పేలిన ల్యాండ్ మైన్.. ముగ్గురు జవాన్లకు గాయాలు
జమ్మూకాశ్మీర్ లో ల్యాండ్ మైన్ పేలడంతో ముగ్గురు సైనికులకు గాయపడ్డారు. ఈ ఘటన పూంచ్ జిల్లాలో ఉన్న ఎల్ వో సీ వెంబడి మెంధార్ సెక్టార్ లోని ఫగ్వారీ గలీ ప్రాంతంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఉన్న ఎల్ వో సీ (నియంత్రణ రేఖ) వెంబడి ల్యాండ్ మైన్ పేలింది. దీంతో ముగ్గురు ఇండియన్ ఆర్మీ జవాన్లకు గాయాలు అయ్యాయి. మెంధార్ సెక్టార్ లోని ఫగ్వారీ గలీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా బుధవారం ఈ ఘటన జరిగింది. సైనికులు గస్తీ విధుల్లో ఉండగా యాక్టివేటెడ్ ల్యాండ్ మైన్ దగ్గరకు వెళ్లడంతో.. ఆకస్మాత్తుగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్లి, చికిత్స అందించారు.
BrahMos missile : బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఇండియన్ నేవీ.. ఇప్పుడు ఎందుకంటే ?
కాగా.. ఈ పేలుడులో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని మెరుగైన చికిత్స కోసం రాజౌరీలోని మిలటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ వారికి ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. నియంత్రణ రేఖకు సమీపంలోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో చొరబాట్ల నిరోధక వ్యవస్థ అమలులో ఉంది. అందులో భాగంగా భారత సైనికులే భద్రతా చర్యలో భాగంగా మందుపాతరలను అమరుస్తారని అధికారులు వివరించారు. అయితే తరచుగా భారీ వర్షాలు సంభవించడం వల్ల ఈ మందుపాతరలు ఒక చోటు నుంచి మరో చోటుకు స్థానభ్రంశం చెందుతాయి.
ఈ క్రమంలోనే వాటిని గమనించకుండా మన సైనికులే ప్రమాదాలకు గురవుతున్నారు. గత నెల 15వ తేదీన రాజౌరీ జిల్లాలో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి కూడా ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. నౌషేరా సెక్టార్ లోని ఫార్వర్డ్ కల్సియాన్ గ్రామంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న గురుచరణ్ సింగ్ అనే సైనికుడు మందుపాతరపైకి కాలు పెట్టారు. దీంతో పేలుడు సంభవించి గాయాలపాలయ్యారు.
అంతకు వారం రోజుల ముందు కూడా ఇదే రాజౌరీ ప్రాంతంలో మందుపాతర పేలడంతో ఇద్దరు ఆర్మీ పోర్టర్లు గాయపడ్డారు. చొరబాటు ప్రయత్నాలను నిరోధించడానికి ఈ ప్రాంతంలో మందుపాతరలను రక్షణ సాధనాలుగా ఉపయోగిస్తున్నప్పటికీ, ఇలాంటి ప్రమాదాలు సైనికులకు పెను సవాళ్లుగా మారుతున్నాయి.