7 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు.. ముంబైలో ఘటన
ముంబైలోని గోరేగావ్ లో ఉన్న ఏడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు.
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గోరేగావ్ లో ఉన్న 7 అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 40 మందికి గాయాలు అయ్యాయి. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ అగ్ని ప్రమాదంలో పలు ద్విచక్రవాహనాలు, కార్లు దగ్ధమయ్యాయి. ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తరువాత మంటలను అదుపులోకి తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
పార్కింగ్ ఏరియాలో ఉన్న గుడ్డలకు మంటలు అంటుకున్నాయని, తరువాత అవి వేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారని ‘ఇండియా టుడే’ నివేదించింది. కాగా.. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఇద్దరు మైనర్లు, ఐదుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. గాయపడిన 40 మందిలో 12 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు.
క్షతగాత్రులు ముంబైలోని హెచ్ బీటీ ఆస్పత్రి, కూపర్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. గోరెగావ్ వెస్ట్ లోని ఆజాద్ నగర్ ప్రాంతంలోని జే భవానీ బిల్డింగ్ లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది. కాగా.. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.