Lucknow: తల్లితో కలిసి ఆలయానికి వెళ్తున్న బాలికపై చిరుతపులి దాడి చేసింది. ఈ ఘటనలో బాలిక ప్రాణాలు కోల్పోయింది. దాడి సమయంలో అక్కడున్న వారు అరవడంతో చిరుతపులి పారిపోయింది. అంతకుముందు జరిగిన మరో ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Girl killed in leopard attack in UP: ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో చిరుతపులి దాడిలో 14 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. తన తల్లితో కలిసి ఆమె ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. నాగినా పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటా కిరాత్ పూర్ గ్రామానికి చెందిన అదితి శుక్రవారం సాయంత్రం తన తల్లితో కలిసి ఆలయానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసిందని సర్కిల్ ఆఫీసర్ సంగ్రామ్ సింగ్ తెలిపారు.
కేకలు విన్న గ్రామస్తులు అరవడంతో చిరుతపులి అక్కడి నుంచి పారిపోయింది. చిరుతపులి దాడిలో గాయపడ్డ బాలికను వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఈ క్రమంలోనే గాయాలు తీవ్రంగా కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందిందని వైద్యులు తెలిపారు.
చిరుతపులితో ఫైట్..
అంతకుముందు కూడా ఇదే ప్రాంతాల్లో చిరుతపులి దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ లో పొలంలో పని చేస్తున్న ఓ మహిళ సోమవారం ఉదయం చిరుతపులితో పోరాడాల్సి వచ్చింది. పొలంలో పనిచేస్తున్న సమయంలో చిరుతపులి దాడికి చేసింది. ఈ క్రమంలోనే ఒక మహిళ తను కుమారుడిని రక్షించుకోవడానికి చిరుతపులిలో పోరాటం చేసింది. చిరుతతో ధైర్యంగా పోరాడి తన పదేళ్ల చిన్నారిని రక్షించడమే కాకుండా, గాయపడిన తర్వాత కూడా దానిని గ్రామం నుంచి తరిమికొట్టగలిగింది. అయితే, ఈ దాడిలో మహిళ, ఆమె బిడ్డ తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మీరట్ కు తరలించారు.
తెల్లవారు జామున 5 గంటల సమయంలో చెరకు పొలం దగ్గర చిరుత దాడి చేసింది. బిజ్నోర్ జిల్లా నాగినా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిత్పూర్ గ్రామానికి చెందిన ఓం ప్రకాశ్ భార్య తన కుమారుడు తికేంద్రతో కలిసి చెరకు తోటలో పనిచేస్తోంది. ఈ సమయంలో అకస్మాత్తుగా అక్కడకు వచ్చిన చిరుతపులి మొదట కొడుకు తికేంద్రపై దాడి చేసి గొంతును నోట్లో నొక్కిపట్టుకుంది. ఇది చూసిన అతని తల్లి కంగారుపడి చెరకు కోత కొడవలితో చిరుతపులిపై ఎదురుదాడికి దిగింది. తన కొడుకుని చిరుతపులి నుంచి రక్షించుకుంది.
చిరుత పులి దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు..
పొలంలో పని చేస్తున్న ఇతరులు అక్కడి నుంచి పారిపోగా, చిరుత నుంచి తన కుమారుడిని కాపాడేందుకు తల్లి ధైర్యంగా పోరాడింది. ఈ సమయంలో చిరుత పలుమార్లు తల్లిని కాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచింది. చాలా సేపు పోరాడిన తర్వాత చిరుత కొడుకును వదిలేసి అక్కడి నుంచి పారిపోయింది.
కుమారుడి మెడను పట్టుకోవడంతో..
చిరుతపులి కొడుకు మెడను పట్టుకుందని తల్లి తెలిపింది. అతని మెడపై లోతైన గాయం అయిందని పేర్కొంది. అక్కడ నుంచి చాలా రక్తం బయటకు వచ్చిందనీ, కొడుకు స్పృహతప్పి పడిపోయాడని తెలిపింది. అతని కడుపు, చేతులు, కాళ్లపై కూడా గాయాలయ్యాయి. ఎలాగోలా కొడుకును చేతుల్లో పెట్టుకుని పొలం నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి కాలినడకనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
