డబ్బుల కోసం బ్యాంకుకి చాలా మంది వెళతారు. అయితే.. ఓ చనిపోయిన వ్యక్తి బ్యాంకుకి వెళ్లడం గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇలాంటి సంఘటన ఓ బ్యాంకులో చోటుచేసుకుంది. అలా శవం బ్యాంకుకి రావడం చూసి అక్కడి సిబ్బంది మొత్తం షాకయ్యారు. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ రాజధాని పాట్నాలోని  పట్నా సిటీ సమీపంలోని షాజహాన్‌పూర్ పరిధిలోని సిగరియావా గ్రామంలో చోటుచేసుకుంది. అక్కడ కెనరా బ్యాంకు బ్రాంచి ఉంది. గ్రామానికి చెందిన మహేష్ యాదవ్(55) అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు బ్యాంకుకు వెళ్లి అతని ఖాతాలోని డబ్బులు కావాలని అక్కడి సిబ్బందిని అడిగారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు బ్యాంకు మేనేజర్ నిరాకరించారు.

దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ మహేష్ యాదవ్ మృతదేహాన్ని నేరుగా బ్యాంకు కార్యాలయంలోకి తీసుకువచ్చారు. దీనిని చూసిన బ్యాంకు సిబ్బంది అవాక్కయ్యారు. మూడు గంటలపాటు మహేష్ మృతదేహం బ్యాంకులోనే ఉంది. బ్యాంకు మేనేజర్ ఎంత నచ్చజెప్పినా గ్రామస్తులు అతని మాట వినిలేదు. దీంతో చేసేదేమీ లేక బ్యాంకు మేనేజరు తన జేబులోని రూ. 10 వేలు తీసి, వారికిచ్చి శాంతపరిచారు. ఆ సొమ్ముతో గ్రామస్తులు మహేష్ యాదవ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్‌కు వివాహం కూడా కాలేదు. పైగా అతనికి బంధువులెవరూ లేరు. అతని బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలకుపైగా మొత్తం ఉంది. అయితే అతని బ్యాంకు ఖాతాకు నామినీ ఎవరూ లేరు. ఈ కారణంగానే బ్యాంకు మేనేజర్ అతని సొమ్ము ఇవ్వడానికి నిరాకరించారు.