మహారాష్ట్రలోని పూణేలో ఘోరం జరిగింది. కారు డ్రైవర్ ఏమరపాటుతో ఓ ప్రాణం బలయ్యింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వృద్ధుడిపై నుంచి ఓ డ్రైవర్ కారు తీసుకెళ్లాడు. దీంతో ఆ వృద్ధుడు చనిపోయారు 

ఆ వృద్ధుడికి ఇళ్లు లేదు. ఏదో చేత‌నైన ప‌ని చేసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తున్నాడు. రోడ్డు ప‌క్క‌నే రోజు విశ్రాంతి తీసుకునేవాడు. ప్ర‌తీ రోజులాగే ఆ రోజు కూడా సాయంత్రం స‌మ‌యంలో రోడ్డు ప‌క్క‌న నిద్రిస్తున్నాడు. కానీ ఆ రోజు ఓ కారు వేగంగా వ‌చ్చి ఆ వృద్ధుడిపై నుంచి వెళ్లింది. దీంతో ఆ వృద్ధుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలో జ‌రిగింది. 

ఈ నెల 20వ తేదీన పూణే ప‌ట్ట‌ణంలోని సాలిస్‌బరీ పార్క్ సమీపంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఆ పార్క్ స‌మీపంలో ఓ కిరాణా దుకాణం ఉంది. ఆ దుకాణానికి స‌మీపంలో ఓ వృద్ధుడు (70) ప్ర‌తీ రోజు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ ఎస్ యూవీ కారు ఈ వృద్ధుడి మీద నుంచి వెళ్లింది. దీంతో అత‌డి శ‌రీరం కారు టైర్ల వ‌ల్ల న‌లిగిపోయింది. ఈ గాయాల వ‌ల్ల వృద్దుడు అక్క‌డే మ‌ర‌ణించారు. 

ఈ స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగిందో తెలుసుకునేందుకు విచార‌ణ ప్రారంభించారు. అందులో భాగంగా ఆ కిరాణ షాప్ స‌మీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను ప‌రిశీలించారు. ఆ ఫుటేజ్ లో ఈ దారుణం బ‌య‌ట‌డింది. ఆ SUV కారు కొంత స‌మ‌యం వ‌ర‌కు ఆ షాప్ ముందు పార్క్ చేసి క‌నిపించింది. అనంత‌రం సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ఆ కారు అక్క‌డి నుంచి బ‌య‌లుదేరింది. అయితే దానికి స‌మీపంలోనే నిద్రిస్తున్న వృద్దుడి మీద నుంచి వెళ్ల‌డం ఆ ఫుటేజ్ లో క‌నిపించింది. 

ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని ద‌ర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కారు నెంబ‌ర్ ను ఆస‌రాగా చేసుకొని నిందితుడి కోసం గాలించారు. ఈ ఘ‌ట‌న‌లో కారు న‌డిపిన 37 ఏళ్ల అనూప్ మెహతాను మంగ‌ళ‌వారం అదుపులోకి తీసుకున్నామ‌ని మార్కెట్ యార్డ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ అనఘా దేశ్ పాండే చెప్పారు. కాగా వాహనానికి ఉన్నపెద్ద బోనెట్ కారణంగా, రోడ్డు పక్కన ఉన్న వ్యక్తిని చూడలేకపోయానని నిందితుడు తెలిపారు.