సారాంశం

మహారాష్ట్రలో ఓ వ్యాపారి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తిపై భార్యపై, అతడి సమక్షంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తీసుకున్న అప్పు తీర్చడం లేదని ఓ వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. అప్పు కట్టలేని నిస్సాహాయ స్థితిలో ఉన్న అతడి ఇంటికి వెళ్లి, అతడి భార్యపై అత్యాచారం చేశారు. భర్త సమక్షంలో ఆ వ్యాపారి ఈ ఘోరానికి పాల్పడ్డాడు. పైగా ఈ దుశ్చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఈ దారుణానికి సంబంధించి ‘ఎన్డీటీవీ’ కథనం, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పూణె సిటీలోని ఓ కాలనీలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే అవసరాల నిమిత్తం అతడు కొంత కాలం కిందట అదే సిటీకి చెందిన 47 ఏళ్ల వ్యాపారి దగ్గర కొంత డబ్బును అప్పుగా తీసుకున్నాడు. కానీ ఆ అప్పును అతడు తీర్చలేకపోయాడు. దీంతో ఆ వ్యాపారికి కోపం వచ్చింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో వ్యాపారి అప్పు తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లాడు. అప్పు చెల్లించాలని కోరాడు. ఆ సమయంలో అతడి భార్య ఇంట్లోనే ఉంది. దీంతో ఆ వ్యాపారి ఆమె భర్తను కత్తితో బెదిరించాడు. అతడి సమక్షంలోనే భార్యపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే నిందితుడు ఈ అత్యాచారాన్ని తన సెల్ ఫోన్ లో వీడియో కూడా తీశారు. 

అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేశారు. దీంతో బాధితురాలు తన భర్త సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

ఇలాంటి ఘటనే ఈ ఏడాది మేలో బీహార్ లో వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చడం లేదని ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ఆరో తరగతి చదివే 14 ఏళ్ల బాలికను తనతో తీసుకెళ్లి, రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను మూడు నెలల పాటు నిర్బంధించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. సివాన్ జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఓ కుటుంబం తన దూరపు బంధువైన మహేంద్ర పాండే దగ్గర రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది. కానీ వివిధ కారణాల వల్ల ఆ బాకీని తిరిగి అతడికి చెల్లించలేకపోయింది. దీనిని అతడు ఆసరాగా తీసుకున్నాడు. ఆ కుటుంబంలో ఆరో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేశాడు. 

ఆ కుటుంబం వద్దకు వచ్చి బాకీ కట్టాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ నిస్సాహాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబం అప్పు కట్టలేకపోయింది. దీంతో వారిని బెదిరించాడు. కుటుంబంలోని మైనర్ బాలికను తన ఇంటికి పంపించాలని బెదిరించాడు. తన ఇంటికి తీసుకెళ్తానని, ఆమె చదువుకునేందుకు కూడా సహకరిస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. అనంతరం బాలికను ఇంటికి తీసుకెళ్లాడు. కానీ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఓ కథనంలో తెలిపింది. ఆమెను మూడు నెలల పాటు ఇంట్లోనే నిర్భందించాడు. ఈ విషయం తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలను పోలీసులు విడిపించి, నిందితుడిపై కేసు నమోదు చేశారు.