వివాహ వేడుకలో వేడి వేడి సాంబార్ గిన్నెలో పడి ఓ 21 యేళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
చెన్నై : తమిళనాడులోని చెన్నైలో ఓ విషాద ఘటన వెలుగు చూసింది. చెన్నై పొరుగున ఉన్న తిరువళ్లూరు జిల్లాలో ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి వేడి రసం గిన్నెలో పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలవ్వడంతో ఆ 21 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
బాధితుడు కాలేజీ విద్యార్థి. ఓ క్యాటరింగ్ కంపెనీలో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నాడు. గత వారం వివాహ వేడుకలో కాటరింగ్ కంపెనీ తరఫున పాల్గొన్నాడు. అతిథులకు భోజనం వడ్డిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు.
అతిథులకు వడ్డించాల్సిన రసం ఉడుకుతున్న పెద్ద గిన్నెలో ఆ వ్యక్తి పడిపోయాడు. తీవ్రంగా కాలిన గాయాలతో బాధితుడిని నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అప్పటినుంచి చికిత్స జరుగుతుంది. కాగా ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 11న మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మధ్యప్రదేశ్ లో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అపశృతి చోటు చేసుకుంది. స్కూల్లో మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో వేడి వేడి పప్పుతో నిండి ఉన్న పాత్రలో పడి ఐదేళ్ల బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారులు మంగళవారం తెలిపారు.
బన్స్లాలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రోజువారీ మద్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఒకటవ తరగతి విద్యార్థిని తేజేశ్వరి తాండియా ఆహారం తీసుకోవడానికి ఇతర పిల్లలతో కలిసి క్యూలో నిలబడింది. ఈ సమయంలో పిల్లలు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకి వెళ్లడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. ఆ హడావిడిలో వేడివేడి పప్పు ఉన్న పెద్ద గిన్నెకు దగ్గరగా నిలబడి ఉన్న ఐదేళ్ల బాలిక ఒక్కసారిగా అందులో పడిపోయింది.
ఇది గమనించిన సిబ్బంది వెంటనే చిన్నారిని అందులోనుంచి బైటికి తీసి ప్రాథమిక చికిత్స అందించేందుకు సమీపంలోని భానుప్రతాపూర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, గాయాలు తీవ్రంగా ఉన్నాయని అక్కడినుంచి చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె శరీరంపై 30 శాతం కాలిన గాయాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం, మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులు వరుసగా కూర్చోవాలి. సిబ్బంది వారికి ఒక్కో ఆహారపదార్థాన్ని వడ్డించాలి. అలా కాకుండా చిన్నారులే లైన్లో రావాలనే సరికి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు.
భానుప్రతాపూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ పాఠశాల అధికారుల నిర్లక్ష్యంపై దర్యాప్తు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. “సంబంధిత ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకుంటున్నాం. వారికి షోకాజ్ నోటీసు జారీ చేయబడ్డాయి. ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని ఆయన తెలిపారు.
