సారాంశం
గుండెపోటుకు గురైన 17 ఏళ్ల బాలికను అత్యవసర చికిత్స నిమిత్తం ఇడుక్కిలోని కట్టప్పనాలోని సెయింట్ జాన్స్ ఆస్పత్రి నుంచి ఎర్నాకులంలోని అమృత ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.
కేరళ : విపత్తుల సమయాల్లో ఎలాంటి వారిలోనైనా మానవత్వం పరిమళిస్తుంది. అప్పుడు అన్నీ మరిచిపోయి.. చేయి, చేయి కలిసి ఎదుటివారి ప్రాణాలు కాపాడడానికి సాయపడతారు. అలాంటి ఓ అపూర్వమైన ఘటన కేరళలో చోటు చేసుకుంది. ఓ 17యేళ్ల బాలికకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. దగ్గర్లో ఆస్పత్రులు లేకపోవడం.. సరైన చికిత్స కోసం వందల కి.మీ.లు ప్రయాణించాల్సి రావడంతో.. కేరళ అంతా ముందుకు వచ్చారు. ఆమెను తీసుకువెడుతున్న అంబులెన్స్ కు అడుగడుగున్నా దారి ఇస్తూ... 129కి.మీ.ల దూరాన్ని, మూడున్నర గంటల ప్రయాణాన్ని తక్కువలో అయిపోయేలా చేసి.. ఆ బాలిక ప్రాణం నిలిచేలా సహాయపడ్డారు.
గుండెపోటుతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలికను అత్యవసర చికిత్స కోసం ఇడుక్కిలోని కట్టప్పనాలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రి నుండి ఎర్నాకులంలోని అమృత ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించాల్సి వచ్చింది. అయితే, ఇదేం తక్కువ దూరం కాదు. అయినా కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రజలు చేయీ చేయీ కలిపారు. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు ఎర్నాకులంలోని ఎడపల్లిలోని అమృత ఆసుపత్రికి అంబులెన్స్ చేరుకుంది.
చెరుతోని-తొడుపుజ-మువట్టుపుజ-వైటిళ్ల-ఎడప్రూట్ మీదుగా 129 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆసుపత్రికి చేరుకుంది అంబులెన్స్. అక్కడ ఆమెకు వైద్యం అందించాడు డాక్టర్లు. ఆ బాలిక పేరు ఆన్ మరియా జాయ్. ఆమెను అమృత ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్ కార్యాలయం మీడియాకు సమాచారం అందించింది. మంత్రి కార్యాలయం అంబులెన్స్ మార్గంలో ప్రయాణీకులను వాహనం కోసం దారి వదలాలంటూ కోరింది.
గురువారం ఉదయం కట్టప్పన చర్చిలో జరిగిన మాస్‌లో 17యేళ్ల ఆన్ మరియా జాయ్ అనే బాలిక గుండెపోటుకు గురైంది. ఆన్ మారియా ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్రం చేతులు కలిపింది. మొదట ఆమెను ఇడుక్కిలోని కట్టప్పనాలోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. అమృత ఆసుపత్రి వైద్యుల సూచనల ప్రకారం అక్కడ ఆమెకు చికిత్స అందించారు. ఆ తరువాత అక్కడినుంచి ఆన్ మారియాను అంబులెన్స్‌లో కొచ్చికి తరలించారు.
ఈ సమయంలో అంబులెన్స్ కు లేట్ అయి.. ఆమెకు వైద్యసహాయం అందకుండా ఇబ్బంది పడొద్దని.. ఆటో రిక్షా డ్రైవర్లు, స్థానికులు రోడ్లను క్లియర్ చేసి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. కట్టప్పనా నుండి కొచ్చికి సగటు ప్రయాణ సమయం 3 గంటల 56 నిమిషాలు. అందరి సహకారంతో ఈ దూరాన్ని చాలా త్వరగా పూర్తి చేశారు.