వారిద్దరూ స్నేహితులు. వారి మధ్య ఒక రోజు గొడవ జరిగింది. దీంతో ఓ స్నేహితుడిపై మరో స్నేహితుడు పగ తీర్చుకోవాలనుకున్నాడు. అనుకున్న ప్రకారమే అతడిని హత్య చేశాడు. ఈ ఘటనలో బాధితుడు, నిందితుడు ఇద్దరూ మైనర్లే కావడం గమనార్హం. ఇది ఢిల్లీలో చోటు చేసుకుంది. 

ఢిల్లీలో ఘోరం జ‌రిగింది. 8 ఏళ్ల బాలుడిని అత‌డి స్నేహితుడైన మ‌రో 13 ఏళ్ల బాలుడు కిడ్నాప్ చేశాడు. అనంత‌రం అత‌డిని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి హ‌త్య చేశాడు. ఈ కిడ్నాప్, హ‌త్య‌కు వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన చిన్న‌పాటి గొడ‌వే కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మిక విచార‌ణలో తేల్చారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ ఢిల్లీకి చెందిన ఇద్ద‌రు మైన‌ర్లు స్నేహితులు. కొంత కాలం కింద‌ట వారిద్ద‌రికి గొడ‌వ జ‌రిగింది. ఇందులో ఒక బాలుడి వ‌య‌స్సు 8 సంత్స‌రాలు కాగా.. మ‌రో బాలుడు వ‌యస్సు 13 సంవ‌త్సరాలు. ఈ గొడ‌వ వ‌ల్ల ఈ పిల్ల‌ల ఇద్ద‌రి మ‌ధ్య విద్వేషం పెరిగింది. దీంతో 13 ఏళ్ల బాలుడు త‌న స్నేహితుడిని కిడ్నాప్ చేసి, హ‌త్య చేశాడ‌ని పోలీసులు తెలిపారు. 

ఈ ఘ‌ట‌నలో చ‌నిపోయిన బాలుడు శనివారం నాడు క‌నిపించ‌కుండా పోయాడ‌ని, అంత‌కు ముందు బయట స్నేహితులతో ఆడుకుంటూ చివరిసారిగా చూశామని బాధిత కుటుంబీకులు తెలిపారు. బాలుడి తల్లి నుండి రాత్రి 9.13 గంటలకు తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అతను చివరిసారిగా మరొక అబ్బాయితో కనిపించాడని కుటుంబ ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాధితుడి స్నేహితుడిని విచారించగా, తానే ఆ బాలుడిని అడవికి తీసుకెళ్లి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడ‌ని పోలీసులు తెలిపారు. 

DCP ప్రణవ్ తాయల్ మాట్లాడుతూ... “ తప్పిపోయిన బాలుడు స్థానికంగా ఎక్క‌డా క‌నిపించ‌లేదు. మేము చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో విచార‌ణ జ‌రిపాము. కానీ ఎవ‌రికీ ఎలాంటి ఆధారం దొర‌క‌లేదు. తల్లి వాంగ్మూలం ఆధారంగా కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితుడిపై రాళ్లతో దాడి చేసి హత్య చేశానని, అతని ఫోన్‌ను కూడా దోచుకున్నాడని వెల్లడించిన 13 ఏళ్ల యువకుడిని మేము ప్రశ్నించాము. అయితే అతను ఆదివారం మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ మేము మృతదేహాన్ని, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఈ ఘ‌ట‌న‌లో నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. 

సీనియర్ పోలీసు అధికారులు మాట్లాడుతూ.. “ ఇద్దరు అబ్బాయిల‌కు కొంతకాలం క్రితం గొడ‌వ జ‌రిగింద‌ని మాకు తెలిసింది. దీంతో ప్రతీకారం తీర్చుకోవడానికి పెద్ద బాలుడు, బాధితుడిని అడవికి తీసుకెళ్లి రాయితో దాడి చేశాడు. బాలుడిని, అతని కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నాం. కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం’’ అని ఓ అధికారి తెలిపారు.