భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.  రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా.. ఒక్క రోజులోనే దాదాపు లక్ష కేసులు నమోదుకావడం అందరినీ కలవరపెడుతోంది.  బుధవారం ఒక్క రోజే దేశంలో 95,735 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం... ఇప్పటి వరకు దేశంలో 44.65లక్షల మందికి ఈ వైరస్ సోకింది.

కాగా.. కరోనా కేసుల్లో అత్యధికంగా నిన్న ఒక్కరోజే నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా మరణాల్లోనూ రికార్డు నమోదైనట్లు అధికారులు చెప్పారు. నిన్న ఒక్కరోజే 1,172 మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

మంగళవారం 90వేలకు పైగా కేసులు నమోదవ్వగా.. బుధవారం 95వేలకు పైగా నమోదవ్వడం తీవ్ర కలవరపెడుతోంది.  ఇదిలా ఉండగా.. కేవలం నిన్న ఒక్కరోజే 72,939 మంది వైరస్ నుంచి కోలుకొని ఇంటికి చేరారు. కాగా.. ఇప్పటి వరకు 34,71,783 మంది ఈ వైరస్ బారి నుంచి క్షేమంగా బయటపడ్డారు. ప్రస్తుతం 9.19లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది.

ఇక రాష్ట్రాలవారీగా చూసుకుంటే..  మహారాష్ట్ర కరోనా కేసుల్లో తొలిస్థానంలో ఉంది. గడిచిన 24గంటల్లో 23,577మందికి వైరస్ సోకింది. అక్కడ నిన్న ఒక్కరోజే 380మది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. గత 24గంటల్లో ఏపీలో 10,418 కేసులు, కర్ణాటకలో 9,540 కేసులు, ఉత్తరప్రదేశ్ లో 6,568 కేసులు, తమిళనాడులో 5,584 కేసులు నమోదయ్యాయి.

కాగా.. మన దేశంలో రికవరీ రేటు 77.7 గా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. గత వారం రోజులుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదౌతున్నట్లు అధికారులు చెబుతున్నారు.