అగ్నిపథ్ స్కీం కింద భారత వైమానిక దళం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు మంచి స్పందన వస్తున్నది. నోటిఫికేషన్ ఈ నెల 24న విడుదలైంది. ఇప్పటి వరకు 94 వేల దరఖాస్తులు వచ్చాయి. 

న్యూఢిల్లీ: ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో అగ్నిపథ్ స్కీం కింద వైమానిక దళం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు మంచి స్పందన వస్తున్నది. అగ్నిపథ్ స్కీం కింద భారత వైమానిక దళంలో అగ్నివీరులుగా చేరడానికి ఇప్పటి వరకు 94,281 దరఖాస్తులు వచ్చాయి. 

ఈ నెల 41వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ అగ్నిపథ్ స్కీంకు లోబడి ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఏఎఫ్‌లో అగ్నివీరులుగా చేరడానికి 94,281 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉన్నది. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 5. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

Scroll to load tweet…

ఎస్‌టీఏఆర్ (స్టార్)గా గుర్తించే ఈ రాత పరీక్ష జూలై 24వ తేదీన జరగనుంది. ఆ తర్వాతే మెడికల్ టెస్టు.. అనంతరం ఫలితాల విడుదల ఉంటుంది. ఈ పరీక్షలో ఎంపిక అయిన వారికి ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి ట్రైనింగ్ మొదలు అవుతుంది. తొలి ఏడాదిగా ఈ సారి మొత్తం 3000 మంది అగ్నివీరులను ఐఏఎఫ్‌లోకి తీసుకోబోతున్నారు.

ఇదిలా ఉండగా, అగ్నిపథ్ స్కీంను పేర్కొంటూ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. భద్రతా బలగాల్లోకి నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం అగ్నిపథ్ స్కీంను ఆయన ప్రశ్నించారు. ఈ స్కీం ద్వారా ఆర్మీలోకి వెళ్లిన యువత నాలుగేళ్లు సర్వీసు చేసి రిటైర్ కావాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్ల ప్రభుత్వ స్కీంలో అగ్నివీరులకు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని ఆయన అడిగారు. 

వరుణ్ గాంధీ తన ట్విట్టర్‌లో హ్యాండిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. నాలుగేళ్లు సైన్యంలో సేవలు అందించి వచ్చే అగ్నివీరులకు పెన్షన్ అవకాశం లేనప్పుడు ఐదేళ్లు పదవిలో ఉండి దిగిపోయే ప్రజా ప్రతినిధులకు ఆ సదుపాయం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని రక్షించే సైనికులే పెన్షన్‌కు నోచుకోకుంటే.. తాను తన పెన్షన్‌ను వదులుకోవడానికి సిద్ధం అని స్పష్టం చేశారు. అగ్నివీరులు వారి వారి పెన్షన్ పొందటం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం పెన్షన్లు వదులుకుందామా? అని అడిగారు.