మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఒకే చోట 90 వీధి కుక్కల మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. కుక్కలను కాళ్లను తీగలతో కట్టేసి ఉంచడం ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. బుల్దానా జిల్లా గిర్దా-సావల్‌దబరా మార్గంలోని ప్రజలకు భారీ ఎత్తున దుర్వాసన రావడంతో ఏం జరిగిందో అర్ధం కాలేదు. దీంతో వారు వాసన వస్తున్న వైపు వెళ్లి చూడగా.. రోడ్ల పక్కన చెల్లా చెదురుగా కుక్కల మృతేదేహాలు పడివున్నాయి.

దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు మొత్తం ఐదు ప్రాంతాల్లోని దాదాపు 100 కుక్కల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో 90 చనిపోగా.. మిగిలినవి చావు బతుకుల్లో ఉన్నాయి. వెంటనే వీటన్నింటిని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. నివేదిక వస్తే తప్ప కుక్కలన్నీ ఎలా చనిపోయాయనే విషయం చెప్పలేమని అధికారులు తెలిపారు.

ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీధి కుక్కలన్నింటినీ చంపేసి ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. కొద్దిరోజుల క్రితం బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలో పంట పొలాలను నాశనం చేసిందనే అక్కసుతో ఓ జింకను కాల్చి సజీవంగా పూడ్చిపెట్టిన ఘటన దుమారాన్ని రేపింది.