అస్సాంను వరదలు అతలాతకులం చేస్తున్నాయి. గత నెలల వచ్చిన వరదల ప్రభావం నుంచే ఇంకా ఎవరూ పూర్తిగా కోలుకోలేదు. మళ్లీ ఈ నెలలో రెండో సారి రాష్ట్రాన్ని వరదలు తాకాయి. దీంతో తొమ్మిది మంది చనిపోయారు. దాదాపు 42 లక్షల మంది తీవ్రంగా ప్రభావితం అయ్యారు.
అస్సాంలో వరదల పరిస్థితి ఆదివారం మరింత దిగజారింది. మరో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల వల్ల 33 జిల్లాల్లో 42.28 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బజలి, బక్సా, బార్‌పేట, బిస్వనాథ్, బొంగైగావ్, కాచర్, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, డిబ్రూఘర్, డిమా హసావో, గోల్‌పారా, హోజాయ్, కమ్‌రూప్, కమ్‌రూప్ (మెట్రో), కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, కరీంగన్, కోక్రాజార్, లఖింపూర్, మజులి, మోరిగావ్, నాగావ్, నల్బరి, శివసాగర్, సోనిత్‌పూర్, శివసాగర్, సౌత్ సల్మారా, తముల్‌పూర్, టిన్సుకియా, ఉడల్‌గురి జిల్లాలు ఈ వరద ప్రళయంతో ప్రభావితం అయ్యాయి.
అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) ప్రకారం... కొండచరియలు విరిగిపడటం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు. పగటిపూట వేర్వేరు ప్రదేశాలలో ఆరుగురు మునిగిపోయారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 71కి చేరింది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. 5,137 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అస్సాంలోని కాచర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలు అలాగే బెరెంగా బెతుకండి ప్రాంతాన్ని కూడా వరదలు తాకాయి.
బరాక్ నది గట్టు కొట్టుకుపోవడంతో ఆ ప్రాంతం మొత్తం వరదలతో నిండిపోయింది. వరదల బారిన పడి రిలీఫ్ క్యాంపుల్లో తలదాచుకోని వ్యక్తులకు కూడా రిలీఫ్ మెటీరియల్స్ పంపిణీ చేశామని, కనీసం 302 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు తాత్కాలికంగా తెరిచినట్లు ASDA తెలిపింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను తరలించడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ కు సహాయం చేస్తోంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది, పోలీసులు, ASDMA వాలంటీర్లను కూడా రెస్క్యూ ఆపరేషన్ల కోసం మోహరించారు.
గడిచిన 24 గంటల్లో అస్సాంలో సగటు వర్షపాతం 37.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. సెంట్రల్ వాటర్ కమిషన్ బులెటిన్ ప్రకారం.. జోర్హాట్‌లోని నీమతిఘాట్, సోనిత్‌పూర్‌లోని తేజ్‌పూర్, గోల్‌పరా, ధుబ్రి పట్టణాల వద్ద శక్తివంతమైన బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలను మించి ప్రవహిస్తోంది. నాగావ్ జిల్లాలోని కంపూర్, ధర్మతుల్ వద్ద దాని ఉపనదులు కోపిలి, లఖింపూర్‌లోని బడాతీఘాట్ వద్ద సుబంసిరి, కమ్‌రూప్‌లోని ఎన్‌హెచ్ రోడ్ క్రాసింగ్ వద్ద పుతిమరి, నల్బరిలోని ఎన్‌టి రోడ్ క్రాసింగ్ వద్ద పగ్లాడియా, బార్‌పేటలోని ఎన్‌హెచ్ రోడ్ క్రాసింగ్ వద్ద మానస్, బార్‌పేట రోడ్డు బ్రిడ్జిపై బెకీలు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్నాయి.
