రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా ప్రభుత్వ ఆస్పత్రిలో పెను విషాదం చోటు చేసుకుంది. కేవలం గంట సమయంలోనే 9 మంది శిశువులు మరణించారు. ఏడాది క్రితం కూడా ఇలాంటి ఘటనలు జరగడం గమనార్హం. అప్పుడు కూడా భారీ సంఖ్యలో శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

బుధవారం రాత్రి జేకే లోన్ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు మరణించగా, గురువారం మరో నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన చిన్నారులంతా 1-4 సంవత్సరాల వయస్సు పిల్లలే ఉన్నారని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి రఘు శర్మ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్ దులారా మాట్లాడుతూ.. చిన్నారుల మరణాలు సాధారణమైనవేనని తెలిపారు. డివిజనల్ కమిషనర్ కేసీ మీనా, జిల్లాా కలెక్టర్ ఉజ్జవల్ రాథోర్ గురువారం సాయంత్రం ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిపై ఆరా తీశారు.

చిన్నారుల మరణాలపై విచారణకు ఆదేశించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. శిశువుల చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. కాగా, చిన్నారుల మృతికి గల కారణాలు తెలియరాలేదు.