కేంద్ర ప్రభుత్వం కొత్త అమలులోకి తీసుకువచ్చిన  మోటార్ వెహికల్ చట్టంతో వాహనదారులు భయపడిపోతున్నారు. వాహనం తీసుకొని రోడ్డు మీదకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఏది మర్చిపోతే... ఎంత ఫైన్ పడిపోతుందో అని కంగారు పడిపోతున్నారు. అయితే.... మీకు రూ.పదివేలు ఫైన్ పడితే.. కేవలం రూ.100 కట్టండి చాలు అంటూ ఓ పోలీసు అధికారి చెప్పిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ట్రాఫిక్ జరిమానాల గురించి అంతగా భయపడాల్సిన పనిలేదని చెప్పడం విశేషం. ఆ వీడియోని ఇప్పటి వరకు 9.7 మిలియన్ల మంది చూడటం విశేషం.

ఇంతకీ ఆ పోలీసు అధికారి వీడియోలో ఏం చెప్పాడంటే.... డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉండీ ఇంట్లో మర్చిపోవడం ద్వారా చాలా మంది చలానాల బారిన పడుతుంటారు. సాధారణంగా చలానా విధించిన 15 రోజులలోగా సంబంధిత మొత్తాన్ని పోలీసులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పై ధ్రువపత్రాలు ఇంట్లో మర్చిపోయి చలానా బారిన పడిన వాహనదారులు 15 రోజుల్లోగా సంబంధిత పత్రాలను ట్రాఫిక్ అధికారులకు చూపిస్తే వారు కేవలం రూ. 100 మాత్రమే కట్టాల్సి ఉంటుందని వివరించాడు. ఈ నిబంధన కొత్త చట్టంలోనే ఉందని సంధు పేర్కొన్నాడు.
 
అయితే తాగి బండి నడపడం, హెల్మెట్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, ఫోన్ మాట్లాడుతూ బండి నడపడం వల్ల విధించే చలాన్లకు ఈ నిబంధన వర్తించదని ఆయన వివరించాడు. కాగా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ వీడియోను వారంలోనే 9.7 మిలియన్ల మంది చూడటంతో పాటు ఇతరులకు షేర్ చేస్తూ సంధుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి