కడుపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తికి స్కాన్ చేసిన వైద్యులు స్కానింగ్ రిపోర్టు చూడగానే షాక్‌కు గురయ్యారు. అసలేం జరిగిందంటే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌‌కు చెందిన వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు.

దీంతో అతను ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించాడు. అతని కడుపును స్కాన్ చేసి చూసిన డాక్టర్లకు లోహపు వస్తువులు కనిపించాయి. నలుగురు వైద్యులు సుమారు గంటన్నరపాటు శ్రమించి అతని పొట్టలో ఉన్న 80 లోహపు వస్తువులను బయటకు తీశారు.

వీటిలో తాళం చెవులు, మేకులు, నాణేలు ఉన్నాయి. సదరు రోగికి మతిస్థితిమితం లేకపోవడంతో ఆ వ్యక్తికి లోహపు వస్తువులు తినడం వ్యసనంగా మారిందని వైద్యులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని వెల్లడించారు.