ఢిల్లీ సమీపంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కూలీలు దుర్మరణం చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఇంకొందరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. యూపీలోని హాపూర జిల్లాలో ధౌలానా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలోని ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్ఛరింగ్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం చెందారు. కనీసం 15 మంది గాయపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు.

హాపూర్ జిల్లా ధౌలానా ఇండస్ట్రియల్ ఏరియాలో కెమికల్ ఫ్యాక్టరీ బాయిలర్‌లో ఈ పేలుడు చోటుచేసుకుంది. ఇంకా చాలా మంది అదే ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్టు తెలుస్తున్నది.

హాపూర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రవీణ్ కుమార్ ఈ ఘటన గురించి మాట్లాడారు. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందారని వివరించారు. కాగా, మరో 15 మంది గాయపడ్డట్టు తెలిపారు. గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలించినట్టు చెప్పారు. వారు ఇప్పుడు చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేపడుతున్నామని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు.

హాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ మేఘా రూపమ్.. మరికొందరు అధికారులతో కలిసి స్పాట్‌కు వెంటనే వెళ్లారు. సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. తాను స్పాట్‌లో ఉన్నానని జిల్లా మెజిస్ట్రేట్ మేఘా రూపమ్ వివరించారు. మరికొందరు అధికారులతో కలిసి సహాయక పనులను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. గాయపడ్డ కూలీలను సమీప హాస్పిటల్‌కు తరలించినట్టు వివరించారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మృతులకు సంతాపం ప్రకటించారు. జిల్లా అధికారులు వెంటనే స్పాట్‌కు వెళ్లాలని, సహాయక పనులను పర్యవేక్షించాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ కార్యాలయం ట్వీట్ చేసింది. బాధితులకు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించింది.