పంజాబ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలినడకన వెళ్తున్న భక్తులను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు.

పంజాబ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాలినడకన వెళ్తున్న భక్తులను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని గర్‌శంకర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

బాధితులు కాలినడకన గర్‌శంకర్ సబ్ డివిజన్‌లోని చరణ్ చో గంగా ఖురల్‌ఘర్ సాహిబ్‌కు వెళుతుండగా ట్రక్కు వారిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అయితే 
ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందినట్టుగా సమాచారం. మరణించిన భక్తులందరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని సమాచారం.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురిని చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు రిఫర్ చేయగా.. మిగిలిన వారిని గర్‌శంకర్‌లోని సివిల్ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి కాలినడకన వెళ్తున్న 17 మంది యాత్రికులను ఢీకొట్టాడని పోలీసులు చెబుతున్నారు. ట్రక్కు బ్రేకులు ఫెయిలయ్యాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇక, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.