Asianet News TeluguAsianet News Telugu

తల్లి పాలు తాగడం మానేసిన 8 నెలల పిల్లాడు.. ఎక్స్‌ రే తీస్తే షాకింగ్ విషయం వెలుగులోకి

మహారాష్ట్రకు చెందిన ఓ 8 నెలల బాలుడు హఠాత్తుగా పాలు తాగడం మానేశాడు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుడిని పిల్లల హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్ రే తీసి చూడగా.. బాలుడి శ్వాసనాళంలో ఉంగరం కనిపించింది.
 

8 months old baby boy swallows toe ring while playing with mommy in maharashtra
Author
First Published Aug 19, 2022, 2:04 PM IST

ముంబయి: చిన్న పిల్లలకు తల్లి పాలే ఆహారం. అన్ని పోషకాలు తల్లి ద్వారానే పిల్లలకు చేరుతాయి. కానీ, మహారాష్ట్రకు చెందిన ఓ బాలుడు హఠాత్తుగా తల్లిపాలు తాగడం మానేశాడు. ఎందుకు మానేశాడో వారికి అర్థం కాలేదు. చిన్న పిల్లలు వారి సమస్యను చెప్పుకోలేకపోతారు. కాబట్టి, ఆ చిన్నారి బాలుడు ఎందుకు తల్లి పాలను కాదంటున్నాడో వారికి అర్థం కాలేదు. అంతేకాదు, తల్లి పాలు కాదన్న తర్వాత శ్వాస తీసుకోవడంలోనూ పిల్లాడు ఇబ్బంది పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఆ 8 నెలల బాలుడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ పిల్లాడికి వైద్యులు ఎక్స్ రే తీశారు. ఈ ఎక్స్ రే రిపోర్టులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని బారామతిలో చోటుచేసుకుంది.

బారామతికి చెందిన 8 నెలల బాలుడు కార్తీక్ సింగ్ ఉన్నట్టుండి పాలు తాగడం మానేశాడు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ, హఠాత్తుగా పాలు తాగడం ఎందుకు మానేశాడా? అని తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. ఇదిలా ఉండగా ఆ బాలుడికి కొత్తగా శ్వాస తీసుకోవడం సమస్యగా మారడం ఈ ఆందోళనను రెట్టింపు చేసింది. 

దీంతో ఆ పిల్లాడిని పిల్లల హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు బాలుడిని పరీక్షించారు. శ్వాస తీసుకోకపోవడానికి కారణం శ్వాస నాళంలో ఏదైనా అడ్డంకిగా ఉన్నదేమో అని వైద్యులు సందేహించారు. అందుకే ఎక్స్ రే తీశారు. ఆ ఎక్స్ రే రిపోర్టును చూసి వైద్యులతోపాటు తల్లిదండ్రులు కూడా ఖంగుతిన్నారు. బాలుడి శ్వాసనాళంలో కాలి మెట్టె కనిపించింది. ఈ కాలి మెట్టె చూసి బాలుడి తల్లి తల తిరిగినంత పనైంది. ఎందుకంటే.. ఆ కాలి మెట్టె ఆమెదే.

కొన్ని రోజుల క్రితం ఆమె కాలి మెట్టె పోయింది. బహుశా అదెక్కడో పడిపోయి ఉంటుందని ఆమె అనుకుంది. వెతికి వెతికి ఊరుకుండిపోయింది. కానీ, ఆ మెట్టె తన కుమారుడి గొంతులో కనిపించింది. ఓ సారి బాలుడు తల్లి కాలిని నోట్టో పెట్టుకుని ఆడుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. బహుశా అదే సమయంలో కాలి మెట్టె బాలుడి నోట్లోకి జారుకుని ఉండొచ్చని వివరించారు. 

వైద్యులు ఆ చిన్నారి బాలుడికి ఆపరేషన్ చేశారు. శ్వాసనాళం నుంచి మెట్టెను బయటకు తీయగలిగారు. ఆపరేషన్ తర్వాత బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నది. యథావిధిగా మళ్లీ ఆటల్లో పడిపోయాడు. మళ్లీ ఆటలాడుకుంటున్న తన కుమారుడిని చూసి ఆ తల్లి దండ్రులు మురిసిపోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios