బిహార్‌లోని పూర్నియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం చెరువులో పడి ఎనిమిది మంది దుర్మరణం చెందారు. వాహనంలోని వారు తారాబడి నుంచి కిషన్‌గంజ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బిహార్‌లోని పూర్నియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం చెరువులో పడి ఎనిమిది మంది దుర్మరణం చెందారు. కంజియా గ్రామంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీశారు. మరణించిన 8 మంది మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాహనంలోని వారు తారాబడి నుంచి కిషన్‌గంజ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తిలకం వేడుకకు హాజరైన తర్వాత కారులో ఉన్నవారు కిషన్‌గంజ్ జిల్లాలోని నానియా గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.‘‘డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం.. కంజియా మిడిల్ స్కూల్ సమీపంలో పూర్నియా-కిషన్‌గంజ్ రాష్ట్ర రహదారి పక్కన నీటితో నిండిన గుంటలో పడిపోయింది" అని బైసీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కుమారి తౌషి చెప్పారు.
‘‘8 మృతదేహాలను వెలికితీశారు. మృతులు తారాబడి నుంచి కిషన్‌గంజ్‌కు వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా రక్షించబడ్డారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపుతున్నాం’’ అని పోలీసులు తెలిపారు. కాగా, మృతుల వివరాలతో పాటు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున అయిల్ ట్యాంకర్ బ్రిడ్జిపై నుంచి పడిపోయిన ఘటనలు.. నలుగురు సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మృతులను పంకజ్ నయాజ్, దీపు ఖతువా, సమీర్ నాయక్, చందన్ ఖతువాగా గుర్తించారు. వీరు సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లి మృతి చెందారు.
నివేదికల ప్రకారం.. పారాదీప్ నుంచి అయిల్ ట్యాంకర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్యాంకర్ తెల్లవారుజామున 1.45 గంటల సమయంలో ఇటమటి వద్ద బడా పాండుసార వంతెనపైకి చేరుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్యాంకర్ వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టింది. అనంతరం ట్యాంకర్ వంతెనపై నుంచి కిందపడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొందరు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే సహాయక చర్యలు చేపడుతున్న సమయంలోనే.. పూర్తిగా ఆయిల్‌తో నిండి ఉన్న ట్యాంకర్ పేలిపోయింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న నలుగురు స్థానికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.
ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పేలుడు ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తొలుత నయాగఢ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌కు తరలించారు.
