ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలో రెండు డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో 8 మంది మరణించారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలో రెండు డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో 8 మంది మరణించారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఇక, లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలోని బారాబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా.. కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపూర్ మద్రాహా గ్రామ సమీపంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన మరో బస్సు దాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. బస్సులను రోడ్డుపై నుంచి పక్కకు తొలగిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
అయితే గాయపడిన వారిని సీహెచ్‌సీ హైదర్‌ఘర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చేర్చారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. మరోవైపు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు. త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరామున్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు.
