కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ మూక రెచ్చిపోయింది. కాన్పూర్ లోని రౌడీ షీటర్ వికాస్ దూబే నివాసంలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వికాస్ దూబే కోసం అతని ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులపైకి కాల్పులు జరిగాయి. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మృృతుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా ఉన్నారు. ఈ సంఘటన జులై 2వ తేదీ అర్థరాత్రి దాటిన తర్వాత తెల్లవారు జామున ఒంటి గంట సమయంలో జరిగింది. ఎస్ఎస్పీ, ఐడి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.

మృతుల్లో ఓ డీఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్ స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. నలుగురు పోలీసులకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వికాస్ దూబేను అరెస్టు చేయడానికి 15 నుంచి 16 మందితో కూడిన పోలీసు బృందం వెళ్లింది. అతనిపై 60 కేసులున్నాయి. 

పోలీసులపైకి అకస్మాత్తుగా దూబే మనుషులు భవనం పై నుంచి ఆయుధాలతో దాడి చేశారు. నిజానికి పోలీసులు వచ్చే దారిని జేసీబీ పెట్టి మూసేశారు కూడా. పోలీసులు దాడి చేస్తున్నారని ముందుగానే తెలుసుకున్న దూబే మనుషులు వారిపై దాడికి అన్నీ సిద్ధంచేసుకున్నారు. 

పోలీసులపై దాడి తర్వాత దూబే మనుషులంతా పారిపోయారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేశారు. కాన్పూర్ సరిహద్దలను మూసేశారు. ఎనిమిది పోలీసులు మరణించిన విషయాన్ని డీజీపీ కాన్పూర్ జోన్ జై నారాయణ్ సింగ్ ధ్రువీకరించారు. 

మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సంతాపం ప్రకటించారు. నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీ హెచ్ సీ అవస్థీని ఆదేశించారు. సంఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.