పశ్చిమబెంగాల్ లో సజీవదహనం ఘటన కలకలం రేపుతోంది. సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. దీనిమీద 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఢిల్లీ : West Bengal లో తాజాగా చెలరేగిన హింసాత్మక ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. బీర్భూమ్ జిల్లా రాంపూర్ హట్ లో ఎనిమిది మందిని సజీవదహనం చేసిన ఘటనపై కేంద్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై 72 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని Union Home Ministry ఆదేశించింది. దీనిపై పూర్తి విచారణ చేపట్టేందుకు హోం శాఖ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు BJP బెంగాల్ చీఫ్ Sukanta Majumdar వెల్లడించారు. హోంమంత్రి Amit Shah తో ఈ విషయం చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ అల్లర్లకు బాధ్యత వహిస్తూ సీఎం Mamata Banerjee రాజీనామా చేయాలని మజుందార్ డిమాండ్ చేశారు. తాజా పరిణామాలు, బెంగాల్లోని శాంతిభద్రతలపై బిజెపి బెంగాల్ యూనిట్ కూడా హోం మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
తాజా అల్లర్లపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. ‘రాంపూర్ హట్ లో జరిగిన ఈ భయంకరమైన హింసాత్మక ఘటనలు రాష్ట్రంలోని శాంతిభద్రతల తీరుకు అద్దం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం హింసా సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఘటనపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా సెక్రటరీని ఆదేశిస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
బెంగాల్ లో ప్రజాస్వామ్యం మంటగలుస్తోందంటూ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటియా మండిపడ్డారు. అల్లర్లు సృష్టించి, సజీవ దహనానికి పాల్పడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం రక్షిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘మమతా బెనర్జీ ప్రభుత్వం నుండి రక్షణ పొందే సంఘ విద్రోహ శక్తులు రాష్ట్రంలో హింసకు పాల్పడితున్నాయి. ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి, బయట నుండి తాళాలు వేసి, నిప్పు పెడతాయి.. శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. తాజా మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మంటలను ఆర్పకుండా తమను అడ్డుకున్నారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు’ అంటూ గౌరవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇది ఘటన..
రాంపూర్ హట్ ప్రాంతంలో.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మనుషుల్నిలోపల పెట్టి ఇళ్లకు తాళాలు వేసి నిప్పు అంటించినట్లు స్థానికులు చెబుతున్నారు.10-12 నివాసాలకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ఈ ఘటనలో 8మంది మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ నాయకుడు భదు ప్రధాన్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున తాజా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కాగా ఈ అల్లర్ల వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.
