Puducherry: దేశంలోని ప‌లు ప్రాంతాల్లో పెరుగుతున్న హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా కేసుల మధ్య కోవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఇన్ ఫ్లూయెంజా లాంటి అనారోగ్యం లేదా తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణ కేసులను గుర్తించ‌డానికి సమగ్ర నిఘా కార్యాచరణ మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.

H3N2 influenza: పుదుచ్చేరిలో ఇప్పటివరకు వైరల్ హెచ్3ఎన్2 సబ్ వేరియంట్ కు చెందిన 79 ఇన్ ఫ్లూయెంజా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు శనివారం తెలిపారు. పుదుచ్చేరిలో సీజనల్ ఇన్ ఫ్లూయెంజా ఉపరకం అయిన హెచ్3ఎన్2 కేసుల సంఖ్య మార్చి 4 వరకు ఈ కేసులు వెగులుచూశాయ‌ని వెల్ల‌డించారు. అయితే, ఇప్పటివరకు వైరస్ కారణంగా మరణాలు సంభవించలేదని కేంద్ర పాలిత ప్రాంత వైద్య సేవల సంచాలకులు జీ.శ్రీరాములు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇన్ ఫ్లూయెంజా కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన అధికార యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దనీ, పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టేందుకు ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లోని ఔట్ పేషెంట్ విభాగాల్లో (ఓపీడీ) ప్రత్యేక బూత్ లు ఏర్పాటు చేశామనీ, ఇన్ ఫ్లూయెంజా వైరస్ లక్షణాలతో వచ్చే వారికి కూడా చికిత్స అందుబాటులో ఉందన్నారు. 

వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని నివారణ చర్యలు తీసుకున్నామని పేర్కొన్న అధికార యంత్రాంగం.. చేతులు కడుక్కోవడం, ఫేస్ మాస్కులు ధరించడం, రద్దీ ప్రదేశాలను నివారించడం సహా కోవిడ్ మహమ్మారికి సిఫార్సు చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్ర‌జ‌ల‌ను కోరారు. అయితే మార్చి నెలాఖరు నాటికి హెచ్3ఎన్2 కేసులు తగ్గుతాయని ఐసీఎంఆర్ నివేదిక సూచించిందని శ్రీరాములు తెలిపారు.

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకారం, హెచ్3ఎన్ 2 అనేది మాన‌వుల‌కు కాకుండా జంతువుల‌లో అధికంగా వ్యాపించే ఇన్ ఫ్లూయెంజా ర‌కం వైర‌స్. ఇది సాధారణంగా పందులలో వ్యాపిస్తుంది. మానవులకు సోకే అవ‌కాశాలు ఉండ‌వు, కానీ, లక్షణాలు కాలానుగుణ ఫ్లూ వైరస్ ల‌ మాదిరిగానే ఉంటాయి. దగ్గు, ముక్కు కారటంతో పాటు జ్వరం, శ్వాసకోశ ఇబ్బంది లక్షణాలు, శరీర నొప్పి, వికారం, వాంతులు లేదా విరేచనాలతో సహా ఇతర లక్షణాలు ఉంటాయి.

అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. 

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇన్ ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. హెచ్3ఎన్2 ఇన్ ఫ్లూయెంజా కేసుల మధ్య కోవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ ఫ్లూయెంజా లాంటి అనారోగ్యం లేదా తీవ్రమైన శ్వాసకోశ సంక్రమణ కేసులను గుర్తించ‌డానికి సమగ్ర నిఘా కార్యాచరణ మార్గదర్శకాలను పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. అలాగే, ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్ లభ్యత, కోవిడ్ -19, ఇన్ ఫ్లూయెంజాకు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ కవరేజ్ వంటి ఆసుపత్రుల సన్నద్ధతను సమీక్షించాలని రాష్ట్రాలను కోరింది. గత కొన్ని నెలలుగా కోవిడ్ -19 వ్యాప్తి గణనీయంగా తగ్గినప్పటికీ, ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ -19 టెస్ట్ పాజిటివిటీ రేట్లు క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విష‌య‌మ‌నీ, దీనిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.