భారత్ చైనా సరిహద్దు వద్ద చైనా దుష్టనీతికి 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 76 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని ఆర్మీ అధికారులు తెలిపారు. 

ఏ ఒక్క భారతీయ సైనికుడు కూడా గల్లంతవలేదని, అందరూ కూడా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు అన్నారు. సైనికులందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఎవ్వరి పరిస్థితి కూడా విషమంగా లేదు అని అధికారులు అన్నారు. 

18 మంది సైనికులు లేహ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో 15 రోజుల్లో వీరు తిరిగి విధుల్లో చేరతారని, మిగిలిన 56 మంది సిబ్బంది వివిధ ఆసుపత్రుల్లో కోలుకుంటున్నారని వారంతా వారం రోజుల్లో తిరిగి విధుల్లో చేరతారని ఆర్మీ అధికారులు తెలిపారు. 

కల్నల్ సంతోష్ బాబు ఆధ్వర్యంలో చైనా సైనికుల టెంటును తొలగించడానికి వెళ్లిన భారత సైనికులపై అతి కిరాతకంగా రాడ్లు, ఇనుప చువ్వలు గుచ్చినా రాడ్లతో 250 మంది చైనా సైనికులు దాడి చేసిన విషయం తెలిసిందే. 

ఈ ఘటనలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు అమరులయ్యారు. చైనా ముందస్తు పథకమే ఘర్షణలు, ఇతర పరిణామాలకు మూలకారణమన్న కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అయితే భారత సైనికులే ఒప్పందాలు ఉల్లంఘించి దాడులు చేశారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఆరోపించారు.

భారత సైనికులను శిక్షించాలని వాంగ్ కోరారు. జూన్ 6న కుదిరిన అవగాహన మేరకు దాడులకు పాల్పడకుండా సంయమనం పాటించాలని మంత్రి జయశంకర్ కోరారు. భారత్- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ, తదనంతరం పరిణామాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

గాల్వాన్‌లో హింసాత్మక ఘర్షణలు, జవాన్ల మృతిపై భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఈ సందర్భంగా తీవ్ర నిరసన తెలిపారు. గాల్వన్‌లో నిర్మాణాలకు చైనా ప్రయత్నించడమే వివాదాలకు కారణమన్నారు.

హింసకు దారి తీసేలా చైనా ప్రణాళిక ప్రకారమే దాడులకు దిగిందనీ.. తద్వారా అన్ని ఒప్పందాలు ఉల్లంఘించిందని అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు మార్చాలనే ఉద్దేశం చైనాలో కనబడుతోందని... జూన్ 6న మిలటరీ కమాండర్ స్థాయిలో డీఎస్కలేషన్ నిర్ణయం జరిగిందని జైశంకర్ అన్నారు.

ఈ మేరకు సైనికులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రోటోకాల్స్ తప్పకుండా పాటించాలన్నారు. చైనా అనుసరిస్తున్న ఇలాంటి అనుచితమైన వైఖరి ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జైశంకర్ వ్యాఖ్యానించారు.

చైనా తన వైపు నుంచి చేపట్టిన కార్యకలాపాలపై పునరాలోచించుకోవాలని సూచించారు. మరోవైపు, చైనా తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలను ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి జైశంకర్‌కు వివరించారు.