ఐదేళ్ల మనవరాలిపై కోపంతో ఓ నాన్నమ్మ.. యాసిడ్ తాగేసింది. తెలిసీ తెలియక మనవరాలు మాట్లాడిన మాటలకు కలవరం చెంది ఆమె ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

75 ఏళ్ల వృద్ధురాలు యాసిడ్ తాగింది. ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న దశలోనే ఆ వృద్ధురాలు మృతి చెందింది. ఐదేళ్ల మనుమరాలు మాట్లాడిన మాటలకు కలత చెందిన ఆ వృద్ధురాలు ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడిందని తెలుస్తోంది. చెట్టుమీదున్న మామిడి కాయలన్నింటినీ నాన్నమ్మ తినేసిందని మనుమరాలు ఆరోపించింది.

దీంతో నాన్నమ్మ ఆగ్రహంతో ఊగిపోతూ యాసిడ్ తాగేసింది. కేసు నమోదు చేసుకున్న బెట్మా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై మృతురాలి కుమారుడు కైలాష్ కుశావహ్ మాట్లాడుతూ తన తల్లి తన ఐదేళ్ల కుమార్తె చెప్పిన చిన్న మాటకు ఆగ్రహించి, యాసిడ్ తాగేసిందన్నారు. కాగా బెట్మా పోలీసు అధికారి మనోహర్ బఘెల్ మాట్లాడుతూ మృతురాలి పేరు మీరాబాయి అని,  కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.