Asianet News TeluguAsianet News Telugu

మోడీ స‌ర్కారు అహంకారం కార‌ణంగా 733 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు.. : రాహుల్ గాంధీ

Buldhana (Maharashtra): కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు అహంకారం కారణంగా 733 మంది రైతులు ప్రాణాలు కోల్పోయార‌ని కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నవంబర్ 19ని కిసాన్ విజయ్ దివస్ (రైతుల విజయ దినం)గా పాటించింది.
 

733 farmers lost their lives due to Modi government's arrogance: Rahul Gandhi
Author
First Published Nov 21, 2022, 1:55 AM IST

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు, వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ మ‌రోసారి కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్రంలోని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు అహంకారం కారణంగా 733 మంది రైతులు ప్రాణాలు కోల్పోయార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నవంబర్ 19ని కిసాన్ విజయ్ దివస్ (రైతుల విజయ దినం)గా పాటించింది. రైతుల‌కు నివాళులు అర్పించిన ఆయ‌న.. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. 

ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశ‌వ్యాప్త కాంగ్రెస్ భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన ఈ పాద‌యాత్ర కాశ్మీర్ లో ముగియ‌నుంది. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, ఆంధ‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్త‌యిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం మ‌హారాష్ట్రలో ముందుకు సాగుతోంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని భస్తాన్ గ్రామంలో జరిగిన మీటింగ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరిపి ఉంటే 733 మంది ప్రాణాలు కాపాడి ఉండేవారని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అహంకారం కార‌ణంగా వారు ప్రాణాలు కోల్పోయార‌ని మోడీ స‌ర్కారుపై ఫైర్ అయ్యారు.

 

శ‌నివారం రోజు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఈ రోజున కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకున్న వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులర్పించారు. కాంగ్రెస్ నవంబర్ 19ని కిసాన్ విజయ్ దివస్ (రైతుల విజయ దినం)గా పాటించింది. "రైతులు ఈ దేశ గొంతుక‌లు.. వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవి.. అందుకే వారు ఢిల్లీ శివార్లలో ఆందోళన చేపట్టారు. కానీ మోడీ ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోలేదు" అని రాహుల్ గాంధీ అన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలకు సహాయం చేసేందుకే రైతు వ్య‌తిరేక ర‌ద్దు చేయ‌బ‌డిన సాగు చట్టాలు తీసుకువ‌చ్చార‌ని ఆరోపించారు.

"ప్రభుత్వం వద్ద పోలీసులు, ఆయుధాలు, పరిపాలన ఉంది.. రైతులకు గొంతు మాత్రమే ఉంది, ఈ ప్రభుత్వ దురహంకారం కారణంగా, ఆందోళన సమయంలో 733 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు" అని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం ముగిసిన త‌ర్వాత‌.. కేంద్రం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దులో పోరాటం సాగిస్తున్న క్ర‌మంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు నివాళులు అర్పించేందుకు సమావేశానికి హాజరైన వారు లేచి నివాళులర్పించారు. అయితే, సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పటాకులు పేల్చారు. కాగా, భార‌త్ జోడో యాత్ర శనివారం రాత్రి బుల్దానా జిల్లా జల్గావ్-జామోద్ తాలూకాలోని భెంద్వాల్‌లో నిలిచింది. 

 


కాంగ్రెస్ శనివారం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 105వ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని షెగావ్ నుండి జాలంబ్ వరకు సాగిన భారత్ జోడో యాత్రతో పాటు మహిళల కోసం ప్రత్యేక 'పాదయాత్ర'ను నిర్వహించింది. ప్రత్యేక మార్చ్‌లో పార్టీ మహిళా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులు ఉన్నారు. వారందరూ రంగురంగుల దుస్తులను ధరించి.. ప్ర‌త్యేక పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. నాగ్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఆఫీస్ బేరర్ నఫీసా సిరాజ్ మాట్లాడుతూ.. "హిందువులు-ముస్లింలు వేర్వేరు కాదు, ఈ చీర ధరించడం ద్వారా, నేను మహారాష్ట్ర సంస్కృతి-సంప్రదాయాన్ని చూపించాలనుకుంటున్నాను" అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios