పుంగనూరు ఘటనలో కీలక సూత్రధారి, టీడీపీ నేత చల్లాబాబు ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఈ కేసులో కోర్టు ఇప్పటివరకు 72మందికి రిమాండ్ విధించింది.
పుంగనూరు : గతవారం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో పోలీసులపై తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిని రిమాండ్కు తరలించారు. తాజా అరెస్టులతో ఇప్పటివరకు పుంగనూరు కేసులో అరెస్టుల సంఖ్య 74 కు చేరుకుంది.
పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి పుంగనూరు సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో టిడిపి అల్లరి మూకలపై ఐదు కేసులు నమోదు చేశారు. పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లాబాబు ప్రధాన సూత్రధారి. ఐదు కేసుల్లో ఆయన ఏ1గా ఉన్నారు. చల్లా బాబు పరారీలో ఉన్నాడు. చల్లా బాబు పిఏ గోవర్ధన్ రెడ్డి పోలీసులకి దొరికాడు.
పుంగనూరు అల్లర్లలో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ నమోదు
గోవర్ధన్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం..తాము ఓ పథకం ప్రకారమే పోలీసులపై దాడులు చేశామని తెలిపాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు టిడిపికి చెందిన పలమనేరు, చిత్తూరు, పుంగనూరుకు చెందిన న్యాయవాదులు దీని మీద మాట్లాడుతూ.. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు తెలిపిన సెక్షన్లు.. నిందితులకు వర్తించవని కోర్టులో తమ తరపున వాదనలు వినిపించారు.
ఆ సమయంలో ఏసీపీ రామకృష్ణ కోర్టు ముందు సాక్షాధారాలను ఉంచారు. ఘటనకు సంబంధించి సుదీర్ఘంగా వివరించారు. ప్రాసిక్యూషన్ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. నిందితులైన 72 మందిని రిమాండ్ కు తరలించాలని ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు సోమవారం అర్ధరాత్రి 72 మంది నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
టిడిపి శ్రేణులు పుంగనూరులో పోలీసులపై దాడులు చేయడానికి నిరసనగా విశాఖపట్నంలోని వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు మంగళవారం నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో అనేకమంది స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శి మొల్లి అప్పారావు, కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి తదితరులు పాల్గొన్నారు.
