జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో  ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారనే వార్తపై ప్రజలు తీవ్రంగా స్పందించడంతో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.

జైపూర్ పట్టణంలోని శాస్త్రీనగర్‌లో చిన్నారి తన ఇంటి పక్కనే సోమవారం నాడు ఆడుకొంటుంది. పొరుగునే ఉండే ఓ వ్యక్తి ఆ బాలికను కిడ్నాప్ చేశాడు.ఇంటి వద్దే ఆడుకొంటున్న చిన్నారి కన్పించకుండాపోయేసరికి కుటుంబసభ్యులు  ఆందోళన చెందారు. 

రెండు గంటల తర్వాత  ఆ బాలిక ఇంటికి దూరంగా 15 కి.మీ దూరంలో బాలిక ఆచూకీ లభ్యమైంది.బాలిక శరీరంపై కొన్ని గాయాలున్నాయి.  ఆసుపత్రిలో ఆ బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. బాధితురాలిని నిందితుడు బెల్టుతో కొట్టాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఏడేళ్ల చిన్నారిని చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ముందుజాగ్రత్తగా  ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.