Asianet News TeluguAsianet News Telugu

ఏడు నెలలుగా కోమాలోనే ఉన్న గర్భిణీ ప్రసవం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన గర్భిణి ఏడు నెలలుగా కోమాలోనే ఉండి తాజాగా ప్రసవించింది. అదీ నార్మల్ డెలివరీ కావడం గమనార్హం.
 

7 months in comma, the pregnant gives birth to healthy baby girl in delhi aiims
Author
First Published Oct 30, 2022, 2:51 PM IST

న్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో ఓ అద్భుత ఘటన జరిగింది. యాక్సిడెంట్‌లో తలకు తీవ్ర గాయమై ఏడు నెలలుగా కోమాలోనే ఉన్న ఓ గర్భిణీ తాజాగా పండంటి బిడ్డకు నార్మల్ డెలివరీ ద్వారా జన్మనిచ్చింది. ఇలాంటి కేసు చూడటం తాను ఇదే తొలిసారి అని వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. గర్భం దాల్చిన 40 రోజుల్లోనే ఆమె ప్రమాదంలో గాయపడింది. ఇన్నాళ్లూ ఆమె కోమాలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నది. గర్భం కొనసాగించాలా? వద్దా? అనే చర్చ జరిగిన స్థితి నుంచి నేడు ప్రసవించే వరకూ అసాధారణ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 సాధారణంగా గర్భం దాల్చిన తొలి రెండు మూడు నెలలు చాలా జాగ్రత్తగా మసులుకోవాలని, బరువులు మోయవద్దని, నెమ్మదిగా అడుగులు వేయాలని, వైద్యులు ఎన్నో రకాల సలహాలు, సూచనలు గర్భిణులకు ఇస్తుంటారు. అవే సూచనలు పాటింపచేయాలని కుటుంబ సభ్యులకూ తెలుపుతారు. కానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సఫీనా మాత్రం 40 రోజుల గర్భంతో ఉండగా ఓ ప్రమాదం బారిన పడింది. కనీసం మెట్లు కూడా ఎక్కరాదని చెప్పే సమయంలో ఏకంగా ప్రమాదానికే గురైంది. కానీ, గర్భానికేమీ జరగలేదు.

Also Read: మధ్యప్రదేశ్‌లో దారుణం.. డీజిల్ లేక ఆగిపోయిన అంబులెన్స్.. టార్చ్ వెలుగులో రోడ్డు మీద ప్రసవం..

అయితే, తలకు బలమైన గాయాలు తగలడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. బులంద్‌షహర్‌లో ప్రాథమికంగా చికిత్స అందించిన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు వైద్యులు రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లారు.     

కానీ, ఆమె అప్పటి నుంచి కోమాలోనే ఉండిపోయింది. తల్లి కోమాలో ఉండగా.. గర్భం మాత్రం దినదినం అభివృద్ధి చెందుతూనే ఉన్నది. 18 వారాల తర్వాత అల్ట్రా సౌండ్ స్కాన్ చేశారు. అందులో పిండం భద్రంగా ఉన్నదని తేలింది.

Also Read: రైల్లో ప్రయాణికులకు ఫ్రీ షవర్... నెట్టింట వీడియో వైరల్..!

గర్భం మూడు నుంచి ఆరు నెలలు దాల్చిన కాలంలో అనేక విధాలుగా ఈ విషయమై చర్చించామని న్యూరోసర్జన్ డాక్టర్ గుప్తా తెలిపారు. తల్లి ఇంకా అపస్మారక స్థితిలో ఉన్న కారణంగా గర్భాన్ని విచ్ఛేదనం చేయాలా? అనే చర్చ చేసినట్టు వివరించారు. జన్మతహా సమస్యలు వచ్చే అవకాశాలు ఏమీ పిండంలో కనిపించలేవని, సీరరియల్ లెవెల్ 2 అల్ట్రా సౌండ్ పరీక్షలు జరిపిన తర్వాత ఈ విషయం తెలిసిందని చెప్పారు. కాబట్టి, గర్భం కొనసాగించాలా? లేక అబార్షన్ చేయాలా? అనే విషయాన్ని కుటుంబానికి వదిలిపెట్టామని అన్నారు. కానీ, ఆ కుటుంబమే గర్భం కొనసాగించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. తన 22 ఏళ్ల న్యూరోసర్జికల్ కెరీర్‌లో ఇలాంటి కేసును ఎప్పుడూ చూడలేదని ఆయన వివరించారు.

ఆ తల్లి ఇప్పటికీ ఇంకా కోమాలోనే ఉన్నది. అక్టోబర్ 22న ఆమె నార్మల్ రూట్ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చినట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios