కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు ఆయన కేబినెట్‌లో చోటు కల్పించారు. రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ వజూభాయ్‌ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేష్‌ కట్టి (హక్కేరి), ఎస్‌.అంగర (సల్లియా), మురుగేష్‌ నిరానీ (బిల్గీ), అరవింద్‌ లింబావలీ (మహదేవపుర), ఎమ్మెల్సీలు ఆర్‌.శంకర్‌, ఎంటీబీ నాగరాజ్‌, సీపీ యోగేశ్వర్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. 

కాగా, 2019 జులైలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ యడియూరప్పకే మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేల తిరుబాటుతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వ కుప్పకూలడంతో బీజేపీకి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అయితే, యడ్డీ నాయకత్వంపై సొంతపార్టీలోనే అసంతృప్తులు, తిరుగుబాటుదారులు ఎక్కువ కావడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు 2019 ఆగస్టులో ఓసారి, 2020 ఫిబ్రవరిలో మరోసారి యడియూరప్ప కేబినెట్‌ను విస్తరించారు.

అయినప్పటికీ బీజేపీ సర్కారుకు ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చిన సీఎం యడియూరప్ప ముచ్చటగా మూడోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు.