తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఏడుగురు మృతి..
మిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు.

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు దెబ్బతినడంతో అందులో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు కొంత శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు సమీపంలో ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఆర్ సతీష్ కుమార్ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. సతీష్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి విలుపురం జిల్లా జింగీ సమీపంలోని మేల్మలయనూర్ గ్రామంలోని అంగళ పరమేశ్వరి ఆలయంతో సహా పలు ప్రాంతాలను సందర్శించి బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలైలోని చెంగం పట్టణ సమీపంలోని పక్కిరిపాళయం గ్రామం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామని.. తదుపరి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.