హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం విద్యార్థులను స్కూల్‌కు తరలిస్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్ కూడా మృతిచెందాడు. 

ఈ ఘోర ప్రమాదం సిర్మార్ జిల్లాలో జరిగింది. సంగ్రాహ్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను స్కూల్‌కు తీసుకువెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది విద్యార్థులు బస్సులో వున్నారు.

ఈ ప్రమాదంలో మరో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చిన్నారులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంత మంది పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాగా ఎత్తులోంచి పడటంతో బస్సు తుక్కుతుక్కు  అయ్యిందని... అందులో ఇరుక్కున్న చిన్నారుల మృతదేహాలను బయటకు తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత మిగతా వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.