పాట్నా: బీహార్ రాష్ట్రంలో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. గయ జిల్లాలోని బిషన్‌గంజ్ గ్రామం పరిధిలోని రెండో నెంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

వేగంగా వచ్చిన ఓ ట్రక్ రెండు ఆటో రిక్షాలను ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనురాగ్ నారాయణ్ మగద్ మెడికల్ కాలేజీకి తరలించినట్టుగా ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు.

ఔరంగబాద్ జిల్లాలోని మదన్‌పూర్ పీహెచ్‌సీకి క్షతగాత్రులను తరలించినట్టుగా ఆయన చెప్పారు.అమస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేగనియా గ్రామానికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. 

బాల్‌గంజ్ లో తిలక్ ఫంక్షన్ కు హాజరై రేగనియా గ్రామానికి  రెండు ఆటోరిక్షాల్లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.