మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. 9 మందిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ప్రాణాలతో రక్షించారు.  

మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. వివరాలు.. రాష్ట్రంలోని ఇండోర్‌లోని స్వర్న్ బాగ్ కాలనీలో రెండంతస్తుల భవనంలో ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. భవనం బేస్‌మెంట్‌లో తెల్లవారుజామున 3.10 గంటలకు అంతా నిద్రిస్తున్న సమయంలో ప్రధాన విద్యుత్ సరఫరా వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలు అక్కడ పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలకు వ్యాపించాయి, వేగంగా భవనం మొత్తం దగ్ధమైంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించారు. వారిలో ఐదుగురి గాయాలు కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

ఇక, ఈ ఘటనకు సంబంధించి భవన యజమాని అన్సార్ పటేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భవనంలో సరైన ఫైర్ సెఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయకపోవడం, నిర్లక్ష్యంగా జనాల మరణానికి కారణమైనందుకు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. 

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్ట సమయాన్ని తట్టుకునేలా మృతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.