మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఒకే రోజు ఏడుగురు మరణించడంతో మృతుల బంధువులు ఆందోళన నిర్వహించారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని మృతుల బంధువులు ఆరోపించారు
ముంబై:మహారాష్ట్రలోని పాలఘర్ జిల్లాలోని ఓ ఆసుపత్రిలో ఒకే రోజు ఏడుగురు మరణించడంతో మృతుల బంధువులు ఆందోళన నిర్వహించారు. కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని మృతుల బంధువులు ఆరోపించారు.ఆసుపత్రిలో చేరే సమయానికే చాలా మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.
నాలా సోపరలోని వినాయక ఆసుపత్రిలో ఏడుగురు మరణించారు. ఈ ఆసుపత్రి ముంబైకి 60 కి.మీ దూరంలో ఉంది. ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగానే రోగులు మరణించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఆక్సిజన్ సిలిండర్ల కొరత విషయమై తమకు సమాచారం ముందుగానే ఇస్తే తమ వారిని ముంబై లేదా ఇతర ఆసుపత్రులకు తరలించేవారమని మృతుల బంధువుల చెప్పారు.తమ తండ్రి ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పింకి వర్మ మీడియాకు చెప్పారు. సోమవారం నాడు తన తండ్రి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తామని చెప్పారని ఆమె గుర్తు చేసుకొన్నారు.
అయితే తమ తండ్రి ఆరోగ్యం విషమించినట్టుగా ఆసుపత్రి ఆ తర్వాత తమకు సమాచారం ఇచ్చారన్నారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉన్న విషయాన్ని తమ దృష్టికి తెచ్చారన్నారు. సోమవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు కనీసం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె చెప్పారు.
తన సోదరుడి ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని వైద్యులు చెప్పారని సాహిన్ అనే మరో రోగి బంధువు చెప్పారు. తన సోదరుడి చికిత్స కోసం రూ. 35 వేలు ఖర్చు చేసి ఇంజక్షన్ కొనుగోలు చేశారని ఆమె గుర్తు చేసుకొన్నారు. సోమవారం నాడు ఉదయం నాడు తన సోదరుడి హర్ట్ బీట్ సరిగా లేదని చెప్పారన్నారు. అయితే చనిపోయిన తర్వాత తమ సోదరుడి గుండె పనిచేసేందుకు ప్రయత్నించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకే రోజున ఏడుగురు మరణించడంతో మృతుల బంధువులు ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకొని నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొన్న జనాన్ని తరిమేశారు.మృతి చెందినవారంతా తక్కువ రోగ నిరోధకశక్తి కలిగి ఉన్నారన్నారు. అంతేకాదు కరోనాతో పాటు ఇతర రోగాలు కూడ వారికి ఉన్నాయని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
వాసాయి-విరార్ మున్సిపాలిటీ తృతీయ సంరక్షణ కేంద్రంగా వినాయక ఆసుపత్రి కొనసాగుతోంది. చిన్న ఆసుపత్రుల నుండి వచ్చే సీరియస్ రోగులకు తాము చికిత్స అందిస్తామని డాక్టర్ శశికాంత్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలుస్తోంది.సోమవారం నాడు ఒక్క రోజే రాష్ట్రంలో 63 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. సుమారు 400 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 34 లక్షలకు పైగా కరోనా బారినపడ్డారు.
