త్రిపురలో జగన్నాథ స్వామి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు, ఉనాకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌లో జగన్నాథుడి ఉల్టా రథయాత్రను నిర్వహించారు.

త్రిపురలో జగన్నాథ స్వామి రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్‌తో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు, వీరిలో ఇద్దరు చిన్నారులు వున్నారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉనాకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌లో జగన్నాథుడి ఉల్టా రథయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇనుముతో చేసిన రథాన్ని లాగుతుండగా.. ఒక్కసారిగా రథానికి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. 

ఆ వెంటనే మంటలు చెలరేగగా.. విద్యుదాఘాతంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు, తోటి భక్తులు వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్ధితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.