మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఇప్పటి వరకు 66మంది అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ రామేశ్వర్‌ శర్మ మీడియాకు వెల్లడించారు.  

వీరిలో 61 మంది ఉద్యోగులు, అధికారులు , ఐదుగురు ఎమ్మెల్యేలు వున్నారు. 20మంది ఎమ్మెల్యేల వైద్య పరీక్షల నివేదికలు అందుకున్నామని.. వీరితో పాటు ఇంకా ఎంతోమంది నివేదికలు రావాల్సి వుందని ప్రొటెం స్పీకర్‌ వెల్లడించారు.

అయితే, వీరందరికీ సమావేశాలకు అనుమతి లేదని..వర్చువల్‌ పద్దతిలో సమావేశాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. కాగా, మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 2లక్షల 30వేల కేసులు బయటపడ్డాయి. వీరిలో 3,545 మంది ప్రాణాలు కోల్పోయారు.