బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. తన భార్య ఐశ్వర్యారాయ్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పట్నా కోర్టులో శుక్రవారం ఆయన విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యారాయ్ లకు వివాహం జరిగి 6నెలలు మాత్రమే కావడం గమనార్హం.

తేజ్ ప్రతాప్ యాదవ్ విడాకుల కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు బిహార్ లో చర్చనీయాంశంగా మారింది. ఐశ్వర్య తల్లిదండ్రులు  ఈ విషయం గురించి చర్చేందుకు లాలు ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ఇంటికి వెళ్లారు. కాగా.. అప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు నచ్చచెప్పినప్పటికీ.. తేజ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని సమాచారం.

కొద్ది రోజుల క్రితం కూడా తేజ్.. విడాకుల కోసం దరఖాస్తు చేయడానికి న్యాయస్థానానికి వెళ్లారని, అయితే.. కొన్ని టెక్నికల్ సమస్యలు రావడంతో ఆ రోజు దరఖాస్తు చేయడానికి కుదరేలని తెలుస్తోంది. దీంతో ఆయన తిరిగి మళ్లీ శుక్రవారం విడాకుల కోసం దరఖాస్తు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై తేజ్ ప్రతాప్ యాదవ్ కుటుంబసభ్యులు ఎవరూ స్పందించడానికి ఇష్టపడలేదు.

కాగా.. ఈ ఘటనపై తేజ్ ప్రతాప్ యాదవ్ లాయర్  యశ్వంత్ కుమార్ శర్మ మీడియాకు వివరణ ఇచ్చారు. తేజ్, ఐశ్వర్యల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగానే వారు విడిపోవాలనుకుంటున్నట్లు చెప్పారు. వారు వారి బంధాన్ని కొనసాగించాలనుకోవడం లేదని చెప్పారు. దీంతో.. హిందూ చట్ట ప్రకారం విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

ఈ ఏడాది మే12వ తేదీన తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్యారాయ్ ల వివాహం దాదాపు పదివేల మంది అతిథుల మధ్య ఘనంగా జరిగింది. ఐశ్వర్య.. బిహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రిక రాయ్ కుమార్తె అన్న విషయం తెలిసిందే.