మఠాన్ని సందర్శించేందుకు వెళ్తుండగా ప్రమాదం.. రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు మృతి..
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గడగ్ జిల్లా నరేగల్‌లో ఎన్‌డబ్ల్యూకేఆర్‌టీసీ బస్సు, టాటా సుమో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు మరణించారు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గడగ్ జిల్లా నరేగల్‌లో ఎన్‌డబ్ల్యూకేఆర్‌టీసీ బస్సు, టాటా సుమో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు మరణించారు. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఫకీరేశ్వర మఠాన్ని సందర్శించేందుకు శిరహట్టికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మృతులందరూ టాటా సమోలో ప్రయాణిస్తున్నావారే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ముగ్గురు పిల్లలను ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో బస్సులోని కొందరు ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలు కాగా.. వారు నరేగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక,వాహనంలో బ్యాగుల్లో లభించిన గుర్తింపు కార్డుల సహాయంతో గాయపడిన, మరణించిన వ్యక్తుల గుర్తింపును పోలీసులు నిర్ధారించారు. ఈ ప్రమాదంతో నరేగల్-గజేంద్రగడ్డ మధ్య కొన్ని గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది.
ఇక, మదన హిప్పరగికి చెందిన శివకుమార్ కలశెట్టి (50), చంద్రకళ కలశెట్టి (42), రాణి కలశెట్టి (32), అఫ్జల్‌పూర్‌కు చెందిన సచిన్ కత్తి (31), దాక్షాయణి కత్తి (33) ఘటనస్థలంలోనే మృతిచెందగా.. బాలుడు దింగలేష్ కలశెట్టి (05) గడగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎన్‌డబ్ల్యూకేఆర్‌టీసీ బస్సు డ్రైవర్ మాట్లాడుతూ.. టాటా సుమో టైర్‌లలో ఒకటి పేలడంతో ఆ వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం సంభవించిందని చెప్పాడు.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ఫక్కీరేశ్వర మఠానికి చెందిన శ్రీ దింగాళేశ్వర స్వామి కూడా గడగ్‌లోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. రెండు కుటుంబాలకు మఠంతో చాలా కాలంగా అనుబంధం ఉందని, కనీసం ఆరు నెలలకు ఒకసారి మఠాన్ని సందర్శించేవారని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.