ఓవర్‌టేక్ చేస్తుండగా ప్రమాదం.. ఢీకొన్న రెండు బస్సులు.. ఆరుగురు దుర్మరణం..
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు.

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు. బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని హింగోలికి వెళ్తుండగా.. మరో ప్రైవేట్ బస్సు నాసిక్ వైపు వెళ్తోందని చెప్పారు.
అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగివస్తున్న బస్సు బాలాజీ ట్రావెల్స్ కంపెనీకి చెందినది కాగా.. నాసిక్ వైపు వెళ్తున్న బస్సు రాయల్ ట్రావెల్స్ కంపెనీకి చెందినదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన 32 మంది ప్రయాణికులకు సమీపంలోని గురుద్వారాలో ప్రథమ చికిత్స అందించారు. మృతి చెందిన వారిలో అమర్‌నాథ్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడు.
నాసిక్ వైపు వెళ్తున్న బస్సు ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి.. రెండో బస్సుకు ఎదురుగా రావడంతో ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఇక, ఈ ప్రమాదం తర్వాత ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే అధికారులు కొద్దిసేపట్లోనే ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. బస్సును రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించి అధికారులు తెలిపారు.