చిక్‌బళ్లాపూర్: క్వారీలో ఉపయోగించేందుకు తీసుకువెళుతున్న జిలెటిన్ స్టిక్స్ ప్రమాదవశాత్తు మార్గమధ్యలోనే పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్ లో చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుళ్ల దాటికి సంఘటనా స్థలంలో శరీరాలు చిద్రమై అవయవాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. మృతదేహాలు అసలు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయని పోలీసులు, స్థానికులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

క్వారీలో వాడేందుకు జిలటిన్ స్టిక్కులను అక్రమంగా తీసుకువెళుతుండగా ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడులో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఈ ఘటనపై స్పందించిన మంత్రి సుధాకర్... ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.