భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఆదివారం నాడు విద్యుత్ తీగ బస్సుమీద పడడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు.

గంజాం జిల్లాలో బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో బస్సులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 30 మంది  తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుప్రతికి తరలించారు. 

గంజాం జిల్లాలోని బ్రహ్మపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. 11 కేవీ విద్యుత్ వైరు పడి ఈ ప్రమాదం చోటు చేసుకొందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

బస్సుపై విద్యుత్ వైర్లు ఎలా పడ్డాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడ ఇదే తరహాలో రాజస్థాన్ రాష్ట్రంలో  బస్సుపై విద్యుత్ వైర్లు తగిలి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.