పొగమంచు కారణంగా ఓ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా నగరంలోని ధంకౌర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగింది. 

11 మంది ప్రయాణికులు మారుతీ ఇర్టీగా కారులో ఆదివారం రాత్రి 11.30 గంటలకు ప్రయాణిస్తుండగా పొగమంచు దట్టంగా కమ్ముకొని రోడ్డు మార్గం కనిపించక కారు ధంకౌర్ ప్రాంతంలోని ఖేర్లీ కాల్వలోకి దూసుపోయింది. కారు కాల్వలో పడిన ఘటనలో ఇద్దరు పిల్లలతోపాటు ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు.

ఈ ప్రమాద ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మహేష్ (35), కిషన్ లాల్(50), నీరేష్ (17), రాంఖిలాడీ(75), మల్లు (12),నేత్రపాల్ (40) లు మరణించారు.పొగమంచు ప్రభావం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రేటర్ నోయిడా పోలీసులు చెప్పారు