కరోనా వైరస్ దేశంలో తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో ఈ వైరస్ బారిన పడుతున్నారు. కాగా.. తాజాగా ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఉంటున్న దాదాపు 57మంది అమ్మాయిలు ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓ హాస్టల్ లో కరోనా కలవరం సృష్టించింది. అందులో ఉండే దాదాపు 57మంది బాలికలకు కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఆ అమ్మాయిలందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

మిగిలిన వారిని క్వారంటైన్ సెంటర్ కి తరలించినట్లు చెప్పారు. అదేవిధంగా వెంటనే హాస్టల్ ని అక్కడి స్టాఫ్ సీజ్ చేయడం గమనార్హం.

కాగా.. ఆ హాస్టల్ లో ఉండే ఇద్దరు అమ్మాయిలు గర్భం దాల్చారంటూ స్థానిక మీడియా వార్త కథనాలు వెలువరచగా.. ఈ కోవిడ్ విషయం కూడా వెలుగుచూసింది. అక్కడ ఉండే అధికారులే సదరు బాలికల గర్భానికి కూడా కారణమంటూ ఆరోపణలు కూడా వినిపించాయి. అయితే.. దీనిపై సంబంధిత అధికారులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

అక్కడ వసతి పొందుతున్న అమ్మాయిలో గర్భం దాల్చినవారు ఉన్నారని.. కాకపోతే వారు గర్భం దాల్చిన తర్వాతే ఈ హాస్టల్ లో చేరినట్లు చెప్పారు. మహిళా, శిశు సంరక్షణ అధికారుల సహాయంతో వారు ఇక్కడ చేరినట్లు చెప్పారు. కాగా.. ప్రస్తుతం ఈ గర్భిణీలకు కూడా కరోనా సోకినట్లు అధికారులు నిర్వహించిన పరీక్షల్లో తేలింది.

ఇదిలా ఉండగా.. కాన్పూర్ లో కరోనా రోజు రోజుకీ విజృంభిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో కాన్పూర్ రెండో స్థానంలో ఉంది.