జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. పుల్వామా తరహా దాడి చేసి మారణహోమం సృష్టించేందుకు గాను ఓ రహదారిపై 52 కేజీల పేలుడు పదార్థాలు అమర్చారు. దీనిని గుర్తించిన సైన్యం వాటిని నిర్వీర్యం చేసినట్లుగా తెలుస్తోంది. 

సైన్యం తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల సమయంలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్‌లో సింటెక్స్ ట్యాంక్ బయటపడింది. దీనిలో 52 కిలోల పేలుడు పదార్థాలు ఉన్నాయి.

ఒక్కొక్కటి 125 గ్రాముల బరువున్న 416 పేలుడు పదార్థాలను సైన్యం గుర్తించింది. దీంతో ఆ పక్కనే మరో ప్రాంతంలో శోధించగా అక్కడ 50 డిటోనేటర్లు బయటపడ్డాయని తెలిపింది.

పేలుడు పదార్థాలు దొరికిన ప్రదేశం 2019లో పుల్వామా దాడి జరిగిన హైవేకి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో వుంది. గతేడాది ఫిబ్రవరి 14న పేలుడు పదార్ధాలతో నిండిన కారుతో ముష్కరులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ని ఢీకొట్టారు.

ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దేశప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని బాలాకోట్‌లో వున్న జైషే మొహమ్మద్ ట్రైనింగ్ క్యాంప్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది.

దీంతో భారత్ పాకిస్తాన్‌ల మధ్య పరిస్ధితి యుద్ధం అంచులదాకా వెళ్లింది. కాగా పుల్వామా దాడికి జైషే చీఫ్ మసూద్ అజార్, అతని సోదరుడు రౌఫ్ అస్గర్‌లు సూత్రధారులని జాతీయ దర్యాప్తు సంస్థ ఇటీవల చార్జీషీట్ దాఖలు చేసింది.

13,500 పేజీల ఆ చార్జీషీట్‌లో జైషే ఉగ్రవాదులు మరో దాడికి కుట్ర పన్నినట్లుగా ఎన్ఐఏ పేర్కొంది. ఇందుకోసం బాంబర్లను కూడా సిద్ధం చేసింది. అయితే బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో దీనికి అడ్డుకట్ట పడింది.