న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆసుపత్రుల్లో కరోనా రోగులకు బెడ్స్ కొరతను దృష్టిలో ఉంచుకొని 500 రైల్వే కోచ్‌లను కూడ అందుబాటులో ఉంచుతామని  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.  ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడ బెడ్స్ కొరత లేకుండా చూస్తామన్నారు. 

ఆదివారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో పాటు పలువురు ఉన్నతాధికారులతో హోం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలోని ముగ్గురు మున్సిఫల్ కార్పోరేషన్ల మేయర్లతో కూడ అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.

ఆరు రోజుల్లో కరోనా పరీక్షలను మరింతగా పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. ప్రస్తుతం చేస్తున్న కేసులకు మూడు రెట్లు అదనంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు.

కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వంతో తాము పూర్తిగా సహకరిస్తామనని కేంద్ర మంత్రి తెలిపారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సపై డాక్టర్ పాల్ నేతృత్వంలో కమిటిని ఏర్పాటు చేశారు. ఈ కమిటి ఈ నెల 15వ తేదీన రిపోర్టు ఇవ్వనుందని మంత్రి తెలిపారు. 

ప్రైవేట్ ఆసుపత్రుల్లో 60 శాతం బెడ్స్ ను కరోనా చికిత్సల కోసం ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో అతి తక్కువ ఖర్చుతో కరోనాకు చికిత్స చేసేందుకు చర్యలు తీసుకొంటామని షా హామీ ఇచ్చారు.

also read:ఇండియాపై కరోనా పంజా:కోవిడ్ మరణాలలో టాప్‌టెన్‌లో భారత్‌కి చోటు

ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లను కూడ అందుబాటులో ఉంచాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కోరారు అమిత్ షా. కరోనాపై కేంద్రంతో కలిసి యుద్ధం చేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా నివారణకు గాను ప్రభుత్వం  జారీ చేసిన నిబంధనలను పాటించాలని ఆయన ప్రజలను కోరారు. 

ఇంటి నుండి బయటకు వస్తే కచ్చితంగా మాస్క్  ధరించాలని కోరారు. మాస్క్ తో పాటు భౌతిక దూరం పాటించాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు.మాస్క్ లేకపోతే తొలుత రూ. 500, ఆ తర్వాత రూ. 1000 జరిమానాను వసూలు చేస్తామన్నారు.